మాస్కో: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తొలిసారిగా యుద్ధ భూమిలోకి అడుగుపెట్టారు. పశ్చిమ రష్యా లోని కర్క్స్ లో బుధవారం ఆయన పర్యటించారు. ఈ ప్రాంతంలోని కొంత భూభాగాన్ని ఉక్రెయిన్ దళాలు స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పుతిన్ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. కర్క్స్ లోని రష్యా దళాల కంట్రోల్ సెంటర్ కు పుతిన్ వెళ్లారు. ఆయన మిలిటరీ దుస్తుల్లో ఉన్న దృశ్యాలను మీడియా ప్రసారం చేసింది. ఈ సందర్భంగా యుద్ధ భూమిలోని పరిస్థితులను రష్యన్ జనరల్ స్టాఫ్ హెడ్ వలెరీ జెరసిమోవ్..పుతిన్ కు వివరించారు. కొంతమంది ఉక్రెయిన్ సేనలు తమకు లొంగిపోయినట్లు తెలిపారు.

30 రోజుల కాల్పుల విరమణ ప్రతిపాదన
వీలైనంత త్వరగా ఈ ప్రాంతం నుంచి కీవ్ దళాలను తరిమికొట్టాలని అధ్యక్షుడు ఆదేశించినట్లు మీడియా కథనాలు పేర్కొన్నాయి. ఇదిలా ఉండగా..యుద్ధంలో 30 రోజుల కాల్పుల విరమణ ప్రతిపాదనకు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ అంగీకరించిన విషయం తెలిసిందే. ఈ ప్రతిపాదన పై చర్చించేందుకు అమెరికా ప్రతినిధులు రష్యా బయల్దేరారు. ఈ విషయాన్ని అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైట్ హౌస్ వద్ద మీడియా సమావేశంలో వెల్లడించారు.మా ప్రతినిధులు రష్యాకు బయల్దేరారు. కాల్పుల విరమణకు పుతిన్ అంగీకరిస్తారనే ఆశిస్తున్నాం. లేదంటే యుద్ధం కొనసాగుతూనే ఉంటుంది. అదే జరిగితే మాస్కో ఆర్థికంగా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది.
ఇరుపక్షాలు ఉమ్మడి ప్రకటనను విడుదల
అది రష్యాకే వినాశకరంగా మారుతుంది.అలాంఇ ఫలితాల్ని నేను కోరుకోవట్లేదు. శాంతిని సాధించడమే నా లక్ష్యం అని ట్రంప్ వివరించారు. ఉక్రెయిన్ లో శాంతి నెలకొల్పడమే లక్ష్యంగా సౌదీ అరేబియాలోని జెడ్డా వేదికగా అమెరికా మంత్రులు, అధికారుల బృందం, ఉక్రెయిన్ ప్రతినిధుల బృందం మధ్య చర్చలు జరిగాయి. ఇందులో అమెరికా ప్రతిపాదించిన 30 రోజుల కాల్పుల విరమణ ఒప్పందానికి ఉక్రెయిన్ అంగీకరించింది. ఈ మేరకు ఇరుపక్షాలు ఉమ్మడి ప్రకటనను విడుదల చేశాయి. ఈ నేపథ్యంలో సైనిక సాయం,నిఘా భాగస్వామ్యానికి సంబంధించి తక్షణమే ఉక్రెయిన్ పై విధించిన ఆంక్షలు ఎత్తివేస్తున్నట్లు అమెరికా తెలిపింది.