జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్ ప్రాంతంలో జరిగిన ఉగ్రదాడి తర్వాత దేశ రాజకీయ, రక్షణ రంగాల్లో ఉత్కంఠకర పరిస్థితులు నెలకొన్నాయి. పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులే ఈ దాడికి పాల్పడ్డారని స్పష్టమైన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. దేశ భద్రతా పరంగా ముమ్మరంగా సమీక్షలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కేబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ (సీసీఎస్) రెండోసారి భేటీ కాబోతోంది. బుధవారం ఉదయం 11 గంటలకు ఈ సమావేశం జరగనుండగా, ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన నిర్వహించనున్నారు. ఇందులో హోం శాఖ మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, విదేశాంగ మంత్రి జైశంకర్ తదితరులు పాల్గొననున్నారు.
Read Also : India -Pakistan War : ఆర్మీకి మోడీ పూర్తి స్వేచ్ఛ..వార్ కు సిద్దమైనట్లే !!
ప్రధాని మోదీ అత్యున్నత స్థాయి భద్రతా సమీక్ష సమావేశం
ఈ సమావేశానికి ముందే ప్రధాని మోదీ అత్యున్నత స్థాయి భద్రతా సమీక్ష సమావేశాన్ని తన అధికారిక నివాసంలో నిర్వహించారు. ఈ భేటీలో రక్షణ శాఖ మంత్రి, జాతీయ భద్రతా సలహాదారు, త్రివిధ దళాధిపతులు, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ వంటి ముఖ్య వ్యక్తులు పాల్గొన్నారు. పాకిస్తాన్‌తో సంబంధాలు మరింతగా ఉద్రిక్తతలకు దారి తీసేలా ఉన్న ప్రస్తుత పరిస్థితిలో, సైనికస్థాయిలో రాబోయే కార్యాచరణపై సుదీర్ఘంగా చర్చించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో త్రివిధ దళాధిపతుల ఉనికి మరింత ప్రాధాన్యతను సంతరించుకుంది.
ప్రధానిని కలిసిన ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్
ఈ భేటీ ముగిసిన వెంటనే ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ప్రధాని మోదీని వ్యక్తిగతంగా కలవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమవుతోంది. సాధారణంగా ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్‌లు ప్రభుత్వ వ్యవహారాల్లో ప్రత్యక్షంగా జోక్యం చేసుకోరు. కానీ యుద్ధ వాతావరణం తలెత్తిన వేళ భగవత్ ఈ విధంగా ప్రధాని నివాసానికి వెళ్లి సమావేశమవడం, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్ కూడా ఈ భేటీలో పాల్గొనడం అనేక ఊహాగానాలకు తావిస్తున్నాయి. దేశ భద్రత, రాష్ట్రీయ విధానాలపై ఆర్ఎస్ఎస్ సూచనలు ఇచ్చిందా? అనే అంశంపై ఆసక్తికరమైన చర్చలు సాగుతున్నాయి.