ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించినపుడు ప్రజలపై కఠినంగా వ్యవహరించే పోలీస్ శాఖలోని కొంతమంది మాత్రం అదే నిబంధనలను పట్టించుకోవడంలేదు. తెలంగాణ రాష్ట్రంలోని పోలీస్ వాహనాలపై ఇప్పటివరకు 17,391 ట్రాఫిక్ ఉల్లంఘనల కేసులు నమోదయ్యాయి. వీటికి గాను మొత్తం రూ.68.67 లక్షల చలాన్లు పెండింగ్‌లో ఉన్నాయని ఆర్టీఐ ద్వారా వెల్లడైంది. ఓ సామాన్య పౌరుడు సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేయడంతో ఈ వివరాలు వెలుగులోకి వచ్చాయి.
పోలీస్ వాహనాలు సిగ్నల్ దాటడం, ఓవర్ స్పీడ్, హెల్మెట్
ట్రాఫిక్ నిబంధనలు అన్నీ అందరికీ సమానంగా ఉండాలి అనే భావన ఉన్నప్పటికీ, కొన్ని పోలీస్ వాహనాలు సిగ్నల్ దాటడం, ఓవర్ స్పీడ్, హెల్మెట్ లేకుండా ప్రయాణించడం వంటి ఉల్లంఘనలకు పాల్పడుతున్నట్టు నమోదైంది. ప్రజలపై చట్టాన్ని కఠినంగా అమలు చేస్తూ, తమపై మాత్రం మినహాయింపులు అనుకోవడం పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. పోలీసులు ప్రజలకు ఆదర్శంగా ఉండాల్సినవారంటూ పలువురు అభిప్రాయపడ్డారు.
పెండింగ్‌లో ఉన్న చలాన్లను వెంటనే చెల్లించాలి
ఇటువంటి సందర్భాల్లో చట్టం ముందు అందరూ సమానమనే సూత్రాన్ని ప్రామాణికంగా పాటించాల్సిన అవసరం ఉంది. పెండింగ్‌లో ఉన్న చలాన్లను వెంటనే చెల్లించడమే కాకుండా, భవిష్యత్తులో పోలీసులు కూడా ట్రాఫిక్ నిబంధనలను గౌరవించేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ప్రభుత్వ స్థాయి నుంచి పోలీస్ వాహనాలపై మానిటరింగ్ పెంచాలని, ఈ వ్యవహారంపై స్పష్టత ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండు చేస్తున్నారు.
Read Also : Caste Survey : కులగణనతో ముస్లింల పరిస్థితేంటో తెలుస్తుంది – ఒవైసీ