హైదరాబాద్: తెలంగాణ వీరనారిగా పిలువబడే చాకలి ఐలమ్మ పేరిట గల కోఠిలోని మహిళా యూనివర్సిటీ అభివృద్ధిపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఈ క్రమంలోనే ఆ దిశగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. తాజాగా యూనివర్సిటీకి రూ.300 కోట్లను కేటాయిస్తూ తెలంగాణ విద్యాశాఖ నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి.

రూ.550 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన
కోఠి ఉమెన్స్ కాలేజ్‌ను వర్సిటీగా అప్‌గ్రేడ్ చేయడంతో పాటు దానికి చాకలి ఐలమ్మ మహిళా యూనివర్సిటీగా సీఎం రేవంత్ ఇటీవల నామకరణం చేసిన విషయం తెలిసిందే. ఇటీవల అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సీఎం రేవంత్.. అక్కడ మొత్తం రూ.550 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. అంతేకాక..ఈ గొప్ప చరిత్ర కల్గిన మహిళ పేరును ఒక యూనివర్శిటీకి పెట్టామన్నారు.
చరిత్రలో నిలిచిపోయే యూనివర్శిటీ
వందేళ్ల చరిత్ర కల్గిన చరిత్ర ఈ మహిళా కళాశాలదని, దానిని యూనివర్శిటీగా మార్చి చాకలి ఐలమ్మ మహిళా యూనివర్శిటీగా నామకరణం చేశామన్నారు. వందేళ్ల క్రితం ఏడుగురు విద్యార్థులతో ప్రారంభమైన ఈ కళాశాల.. నేడు ఏడువేల మందితో యూనివర్శిటీగా రూపాంతరం చెందిందన్నారు. దీనికి ఐదు వందల కోట్ల నిధులను మంజూరు చేస్తున్నట్లు రేవంత్ ప్రకటించారు. ఇది చరిత్రలో నిలిచిపోయే యూనివర్శిటీ కావాలన్నారు సీఎం రేవంత్.