శ్రీసత్య సాయిబాబా శతజయంతి ఉత్సవాలు వచ్చే ఏడాది నవంబర్ 23న జరగనున్న నేపథ్యంలో, కేంద్ర ప్రభుత్వం ఓ ప్రత్యేక నాణెం విడుదల చేయాలని నిర్ణయించింది. దీనిలో భాగంగా రూ.100 విలువ గల నాణెం విడుదల చేస్తూ అధికారికంగా నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ ప్రత్యేక నాణెం ద్వారా సత్య సాయి సేవా ధర్మాన్ని స్మరించేందుకు, ఆయన ఆశయాలను గుర్తుంచుకునేందుకు వినూత్నంగా ఒక గుర్తుగా నిలపాలని ప్రభుత్వ సంకల్పం.
నాణెం బరువు
ఈ ప్రత్యేక నాణెం 44 మిల్లీమీటర్ల చుట్టుకొలతతో, 35 గ్రాముల బరువుతో తయారు చేయబడుతుంది. ఇందులో 50 శాతం వెండి, 40 శాతం రాగి, 5 శాతం నికెల్, 5 శాతం జింక్ మిశ్రమంగా ఉంటాయి. నాణెం ముందు భాగంలో అశోక స్తంభం ఉంటుంది. ఇది భారతదేశ అధికార చిహ్నంగా ప్రసిద్ధి చెందింది.
నాణెంలో “1926” అనే సంవత్సర నెంబరు
నాణెం వెనుక భాగంలో శ్రీసత్య సాయిబాబా చిత్రం, “1926” అనే సంవత్సర నెంబరు కనిపిస్తాయి. ఈ సంఖ్య ఆయన జన్మ సంవత్సరం సూచిస్తుంది. నాణెం రూపకల్పనలో సాంస్కృతిక విలువలతో పాటు, ఆధ్యాత్మికతను ప్రతిబింబించేలా రూపొందించారు. ఈ నాణెం కలెక్టర్స్‌కు మాత్రమే కాకుండా, భక్తులకూ ఎంతో ప్రత్యేకమైనది కానుంది. శతజయంతి సందర్భాన్ని మరింత ఘనంగా మలచేందుకు ఇది ఒక చారిత్రక గుర్తుగా నిలిచే అవకాశం ఉంది.