Temperatures : తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. మార్చి నెలలోనే గరిష్ఠ ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకుపైగా నమోదవుతున్నాయి. సాధారణం కన్నా 3.3 డిగ్రీలు అధికంగా నమోదవుతున్నాయి. మరీ ముఖ్యంగా.. దక్షిణ తెలంగాణతో పోలిస్తే ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంది. వచ్చే రెండు రోజుల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 42 డిగ్రీలకుపైగా నమోదయ్యే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణం కేంద్రం తెలిపింది. ఆదిలాబాద్, కుమురంభీం, మంచిర్యాల, జగిత్యాల జిల్లాల్లో ఎండ తీవ్రతతోపాటు వడగాలుల ప్రభావం కూడా ఉంది. ఈరోజు ఉష్ణోగ్రతలు 42 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశం ఉన్నందున 7 జిల్లాల్లో ఎల్లో అలర్ట్ జారీ చేశారు. హైదరాబాద్‌లో 39 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.

కోస్తా జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు
ఏపీలోనూ ఎండలు ఠారెత్తిస్తున్నాయి. కోస్తా జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటాయి. గతేడాదితో పోలిస్తే ఈసారి ఉష్ణోగ్రతలు మరింత పెరిగినట్లుగా వాతావరణ కేంద్రం తెలిపింది. పల్నాడు జిల్లాలోని రెంటచింతలలో 42.8 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. రెంటచింతల ప్రాంతంలో సాధారణంగా మార్చి నెలలో 35 డిగ్రీల వరకు ఎండ ఉంటుంది. ఈసారి మాత్రం మార్చి మధ్యలోనే 42 డిగ్రీలు దాటిపోయింది. దాంతో రానున్న రోజుల్లో పరిస్థితి ఎలా ఉంటుందోనని అక్కడి జనం ఆందోళన చెందుతున్నారు. కోస్తాలోని కొన్ని జిల్లాల్లో వాతావరణం అనూహ్యంగా మారుతోంది.
డీహైడ్రేషన్, తలనొప్పి, నీరసం
మార్చిలోనే భానుడు తన ప్రతాపంతో టాప్ లేపేస్తున్నాడు.. ఈ ప్రాంతం అ ప్రాంతం అని తేడాలేకుండా మంటలు పుట్టిస్తున్నాడు. దీంతో జనాలు అసమ్మర్ హీట్ ను బీట్ చేసేందుకు చల్ల చల్లని,కూల్ కూల్ గా వుండే ఫ్రూట్స్ , సమ్మర్ డ్రింక్స్ ను తీసుకుని ఎండ ప్రతాపాన్నికూల్ చేస్తున్నారు. మరో వైపు వేడి తీవ్రత అధికంగా ఉండటం వల్ల డీహైడ్రేషన్, తలనొప్పి, నీరసం, గుండెపోటు ప్రమాదాలు పెరుగుతాయి అంటున్నార వైద్య నిపుణులు. అవసరమైతే తప్ప బయటకు రావొద్దని సూచిస్తున్నారు.