న్యూఢిల్లీ: కోల్‌కతా ఆర్‌జీ కర్ మెడికల్ కాలేజీ లైంగిక దాడి, హత్య ఘటనపై తాజాగా సుప్రీంకోర్టులో మరో పిటిషన్ దాఖలైంది. దారుణ ఘటనకు సంబంధించిన కేసును కొత్తగా దర్యాప్తు చేపట్టాలని పిటిషనర్ డిమాండ్ చేశారు. ట్రైనీ డాక్టర్ తల్లిదండ్రుల పిటిషన్‌పై వెంటనే విచారణ చేపట్టాలని సర్వోన్నత న్యాయస్థానాన్ని కోరారు. అయితే, ఈ పిటిషన్‌ను వెంటనే విచారించేందుకు కోర్టు నిరాకరించింది. కేసు విచారణను మార్చి 17న చేపట్టనున్నది. జనవరి 20న ఆర్‌జీ ఖర్ కేసులో దిగువ కోర్టు శిక్షను విధించిన విషయం తెలిసిందే.

కేసులో దోషిగా తేలిన సంజయ్ రాయ్‌కి కోర్టు జీవిత ఖైదు విధించింది. సీల్దా కోర్టు సంజయ్ రాయ్‌కి రూ.50వేల జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. గత ఏడాది ఆగస్టు 9న ఆర్‌జీ కర్ మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్‌లో పోస్ట్ గ్రాడ్యుయేట్ ట్రైనీ డాక్టర్ మృతదేహం సెమినార్ హాల్‌లో కనిపించింది. లైంగిక దాడి చేసి హత్య చేసినట్లుగా గుర్తించారు. ఈ ఘటన యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. నిందుడిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మరుసటి రోజున ఈ కేసులో నిందితుడు సంజయ్ రాయ్‌ని పోలీసులు అరెస్టు చేశారు. గత నెలలో కోర్టు జీవిత ఖైదు విధిస్తూ సీల్దా కోర్టు తీర్పును వెలువరించింది.