Ponman Review : ఈ నెల 14 నుంచి మొదలైన స్ట్రీమింగ్ మలయాళ సినీ పరిశ్రమలో బాసిల్ జోసెఫ్ ఇప్పుడు బాగా పాపులర్ అయ్యాడు. ముఖ్యంగా ఓటీటీ వేదికల ద్వారా ఆయన పేరు మరింత ప్రాచుర్యం పొందింది. తాజాగా ఆయన నటించిన ‘పొన్మన్’ సినిమా జనవరి 30న థియేటర్లలో విడుదలై మంచి స్పందన పొందింది. 10 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన ఈ చిత్రం, ఇప్పుడు జియో హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. జోతిష్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా కథ ఏమిటో ఇప్పుడు చూద్దాం.

కథ
అజేష్ (బాసిల్ జోసెఫ్) ఒక జ్యుయలరీ షాపులో సేల్స్ ఏజెంట్‌గా పని చేస్తుంటాడు. ఆ షాపును ఓనర్ కొడుకు ఆంబ్రోస్ నిర్వహిస్తుంటాడు. ఈ షాపులో వినూత్నమైన విధానం ఉంది. పెళ్లి కూతురికి బంగారు ఆభరణాలను ముందుగా సమకూరుస్తారు. కానీ, పెళ్లి రోజు డబ్బులు చెల్లించిన పరిమితికి అనుగుణంగా నగలను అప్పగిస్తారు.స్టెఫీ (లీజుమోల్ జోస్) పెళ్లి కోసం 25 సవర్ల బంగారం తీసుకోవడానికి అజేష్ అంగీకరిస్తాడు. ఆమె అన్న బ్రూనో (ఆనంద్ మన్మథన్) సూచన మేరకు బంగారం అందజేస్తాడు. కానీ, పెళ్లి రోజున అనుకున్నదానికంటే తక్కువ మొత్తమే వస్తుంది. అజేష్ 13 సవర్లకు డబ్బు తీసుకుని, మిగిలిన 12 సవర్ల బంగారాన్ని తిరిగి ఇవ్వాలని బ్రూనోను అడుగుతాడు. అయితే, పెళ్లి అయిపోయాక ఆభరణాలను తీస్తే గొడవలు జరుగుతాయని వాళ్లు ఆపుతారు. అజేష్ నగల కోసం స్టెఫీ అత్తింటికి కూడా వెళతాడు. అక్కడ స్టెఫీ భర్తకు నిజం తెలిసిపోతుందేమోననే భయంతో అందరూ టెన్షన్‌లో ఉంటారు. తన మెడలోని నగలు తీస్తే భర్త ఊరుకోడని స్టెఫీకి తెలుసు. ఆమె నుంచి బలవంతంగా బంగారం తీసుకోవాలంటే, ఆమె భర్త క్రూరుడు. ఇలాంటి పరిస్థితుల్లో అజేష్ ఏం చేశాడు? నగలను తిరిగి పొందగలిగాడా? అనేదే మిగతా కథ.
విశ్లేషణ
పెళ్లిళ్లు బంగారం లేకుండా జరగవు. బంగారం విషయంలో తేడా వస్తే కుటుంబ సంబంధాలకే విఘాతం కలుగుతుంది. ఒక యువకుడు, ఒక యువతి బంగారం విషయంలో ఎలాంటి సమస్యలను ఎదుర్కొన్నారు? అనే అంశాన్ని కథ ఆసక్తికరంగా చెప్పుకొచ్చింది.జ్యుయలరీ షాపులో పని చేసే అజేష్, నగలను అప్పుగా తీసుకున్న స్టెఫీ, ఆ బంగారంపై ఆశపడి ఆమెను పెళ్లిచేసుకున్న భర్త మధ్య నడిచే కథ ఇది. ఈ ముగ్గురు ప్రధాన పాత్రల చుట్టూ కథ మలుపులు తిరుగుతుంది. కామెడీ టచ్‌తో ఆసక్తికరంగా నడిచిన కథ, ప్రేక్షకులను ఆకట్టుకునేలా దర్శకుడు మలిచారు. రూరల్ బ్యాక్‌డ్రాప్ కథను సహజంగా చూపించే ప్రయత్నం చేయడం ప్రధాన ఆకర్షణ.
పనితీరు
చిన్న కథ అయినా, ప్రేక్షకుల ఆసక్తిని నిలబెట్టేలా నడిపారు. ఆసక్తికరమైన స్క్రీన్‌ప్లేతో కథ సాగుతుంది. క్లైమాక్స్ కూడా బాగా మలచారు. సినిమా చివరివరకు ప్రేక్షకుడిని కదిలించేలా ఉంటుంది.బాసిల్ జోసెఫ్ తన కామెడీ టైమింగ్‌తో మళ్లీ నిరూపించుకున్నాడు. లీజుమోల్ జోస్ కొత్త పెళ్లికూతురిగా నటన అద్భుతంగా ఉంది. ఆమె భర్త పాత్రలో సాజిన్ గోపు తన క్రూరతను ప్రదర్శించి ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాడు. సాను జాన్ వర్గీస్ సినిమాటోగ్రఫీ సహజత్వాన్ని అందించింది. నేపథ్య సంగీతం, ఎడిటింగ్ కూడా సినిమాకు మరింత బలాన్ని ఇచ్చాయి.
ముగింపు
కొన్ని విషయాలు సాధించడానికి తెలివితేటలు, ఓర్పు అవసరం. శక్తితో కాకుండా, బుద్ధితో సమస్యలు పరిష్కరించాలి. అవసరానికి దూరంగా ఉండే రాజకీయ నాయకులకంటే, కష్టానికి విలువ ఇచ్చే మనుషులే గొప్పవారని ఈ సినిమా చెప్పిన సందేశం. కుటుంబంతో కలిసి చూడదగిన మంచి వినోదాత్మక చిత్రం ఇది.