Harish Rao : హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల వేలాన్ని నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ వర్సిటీ విద్యార్థులు రోడ్డెక్కారు. ప్రశాంతంగా వారు నిరసన ర్యాలీలు తీస్తుంటే పోలీసులు రెచ్చిపోయి మరీ వారి మీద లాఠీలు ఝలిపించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇందిరమ్మ కాలం నాటి ఎమర్జెన్సీని రేవంత్ రెడ్డి సోకాల్డ్ ప్రజాపాలన
తాజాగా విద్యార్థులపై పోలీసులు, ప్రభుత్వ యంత్రాంగం వ్యవహరిస్తున్న తీరుపై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు సోషల్ మీడియా ఎక్స్ వేదికగా స్పందించారు. ఇందిరమ్మ కాలం నాటి ఎమర్జెన్సీని రేవంత్ రెడ్డి సోకాల్డ్ ప్రజాపాలన తలపిస్తుందని హరీశ్‌రావు ధ్వజమెత్తారు. హెచ్‌సీయూ విద్యార్థులు, వారికి మద్దతుగా నిలిచిన ప్రొఫెసర్లపై లాఠీ ఛార్జ్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం అని హరీశ్‌రావు పేర్కొన్నారు. పచ్చని అడవిని నాశనం చేయొద్దని శాంతియుతంగా నిరసనకు దిగిన విద్యార్థులపై పోలీసుల లాఠీచార్జ్ చేయడం సరికాదన్నారు.

దొరికిన విద్యార్థులను దొరికినట్లు లాఠీలతో చితకబాదారు
కాగా, కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బుధవారం ఉదయం హెచ్‌సీయూ క్యాంపస్‌లో ప్రొఫెసర్లు, విద్యార్థులు నిరసన చేపట్టారు. ఈ క్రమంలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న ప్రొఫెసర్లు, విద్యార్థులపై పోలీసులు లాఠీలు ఝుళిపించారు. దొరికిన విద్యార్థులను దొరికినట్లు లాఠీలతో చితకబాదారు. పోలీసుల తీరుపై ప్రొఫెసర్లు విద్యార్థులు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రేవంత్ సర్కార్‌కు వ్యతిరేకంగా నినదిస్తూ, పోలీస్ జులుం నశించాలని నినాదాలు చేశారు. దీంతో హెచ్‌సీయూ క్యాంపస్‌లో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.