తెలంగాణ రాష్ట్రంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోతోంది. ఎండలు, ఉక్కపోతతో సతమతమవుతున్న ప్రజలకు వానలు ఊరటనిచ్చేలా ఉన్నా, పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురుగాలుల వర్షాలు కలకలం సృష్టిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ హెచ్చరికలు జారీచేసి, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్, ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్, మెదక్, సిద్దిపేట జిల్లాల్లో గాలి వాన, వడగండ్ల వర్షం కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అప్రమత్తం
వాతావరణ శాఖ సూచనల మేరకు సీఎం రేవంత్ రెడ్డి అధికారులను అప్రమత్తం చేశారు. అన్ని విభాగాల అధికారులు 24 గంటలూ మానిటరింగ్ చేయాలని, అత్యవసర సహాయ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రజలకు అసౌకర్యం కలగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేయాలని సూచించారు. ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి సంబంధిత జిల్లాల కలెక్టర్లతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించి, ఏర్పాట్లపై సమీక్షించారు. గతంలో ఎదురైన అనుభవాల ఆధారంగా అధికారులు ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆమె ఆదేశించారు.
హైదరాబాద్‌లో వర్షం – ప్రజలకు చల్లదనం
హైదరాబాద్ నగరంలో శుక్రవారం రాత్రి నుంచి వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా మియాపూర్, మదీనాగూడ, చందానగర్, కూకట్ పల్లి, హైదర్‌నగర్, ఆల్విన్ కాలనీ, నిజాంపేట, అమీర్‌పేట, పంజాగుట్ట, ఎస్ఆర్‌నగర్, బాచుపల్లి, మూసాపేట, బోరబండ వంటి ప్రాంతాల్లో వర్షం కురవడంతో నగరవాసులకు తాత్కాలిక ఉపశమనం లభించింది. తెలంగాణలో ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల్లో వడగండ్ల వాన తీవ్ర ప్రభావం చూపింది. సిద్దిపేట జిల్లా, దుబ్బాక, మిర్దొడ్డి, తొగుట మండలాల్లో గాలులతో కూడిన వర్షం కురిసింది. నిజామాబాద్ జిల్లా, దర్పల్లి, ఇందల్వాయి మండలాల్లో వడగండ్ల వర్షం కురిసి పంటలకు నష్టం కలిగింది. కరీంనగర్ జిల్లా, చొప్పదండి మార్కెట్ వద్ద భారీ వర్షానికి మొక్కజొన్న తడిసిపోయింది. మెదక్ జిల్లా, పాపన్నపేట మండలాల్లో గాలులతో కూడిన వర్షం కురవడంతో మామిడికాయలు నేలరాలాయి.
అవస్థలు పడుతున్న రైతులు
వడగండ్ల వర్షాల కారణంగా పలు జిల్లాల్లో వరిధాన్యం, మొక్కజొన్న, మామిడి తోటలు నష్టపోయాయి. నిజామాబాద్, కరీంనగర్, మెదక్ ప్రాంతాల్లో పంటలు నేలకూలాయి. రైతులు ప్రభుత్వ సహాయం కోసం ఎదురు చూస్తున్నారు. వర్షాల ప్రభావంతో మెదక్, నిజామాబాద్, వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల్లో విద్యుత్ సరఫరా తాత్కాలికంగా నిలిచిపోయింది. విద్యుత్ సిబ్బంది వెంటనే మరమ్మతులు చేపట్టినా, కొన్నిచోట్ల ట్రాన్స్‌ఫార్మర్లు దెబ్బతినడంతో మరింత సమయం పట్టే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. వాతావరణ శాఖ ప్రకారం రానున్న 48 గంటలలో వర్షాలు, ఈదురుగాలులు కొనసాగనున్నాయి. రానున్న మూడు రోజులపాటు గరిష్ఠ ఉష్ణోగ్రతలు క్రమంగా పెరిగే సూచనలు ఉన్నాయి. గంటకు 40-50 కిమీ వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది. కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ముందుగా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది. ఆదివారం కొన్ని జిల్లాల్లో వర్షాలతోపాటు ఈదురుగాలులు గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఈదురుగాలులు, ఉరుములు, వడగండ్ల వర్షాల ప్రభావంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే అధికారులను అప్రమత్తం చేశారు. వర్షాల కారణంగా పంటలు నష్టపోతుండటంతో రైతులకు నష్టపరిహారం అందించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ప్రజలు అధికారుల సూచనలను పాటించి జాగ్రత్తలు తీసుకోవాలి.