Revanth Reddy : ప్రధాని మోడీకి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లేఖ రాశారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీ, ఎంఐఎం, సీపీఐ నాయకులతో ప్రధానిని కలిసేందుకు అపాయింట్ మెంట్ కోరుతూ ఆ లేఖ రాశారు. స్థానిక సంస్థలతో పాటు విద్య, ఉద్యోగ రంగాల్లో వెనుకబడిన తరగతులకు రిజర్వేషన్లకు సంబంధించి అసెంబ్లీలో రెండు బిల్లులు ప్రవేశ పెట్టారు. ఆ రెండు బిల్లులు అమోదం పొందాయి. ఈ నేపథ్యంలో బిల్లులకు కేంద్రం మద్ధతు కోరేందుకు అపాయింట్ మెంట్ ఇవ్వాలని ముఖ్యమంత్రి లేఖలో విజ్ణప్తి చేశారు. సోమవారం అసెంబ్లీలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. రిజర్వేషన్ల సాధనకు తాను నాయకత్వం వహిస్తానని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. కలిసి కట్టుగా అందరం ప్రధాని మోడీ వద్దకు వెళ్దామని ఆయన అన్ని పార్టీలకు పిలుపు నిచ్చారు.

బీసీ రిజర్వేషన్లకు చట్టబద్ధత
ఆ క్రమంలో ప్రధాని మోడీ అపాయింట్‌మెంట్ ఇప్పించాలని కేంద్ర మంత్రులు జి.కిషన్ రెడ్డి, బండి సంజయ్‌లకు ఆయన విజ్ఞప్తి చేశారు. బీసీలకు రిజర్వేషన్లపై పార్టీలకతీతంగా ఐక్యంగా ఉన్నారని రేవంత్ రెడ్డి తెలిపారు. 1979లోనే ఈ రిజర్వేషన్ల కోసం మండల్ కమిషన్ వేశారని గుర్తు చేశారు. మండల్ కమిషన్‌తోనే బీసీ రిజర్వేషన్లకు చట్టబద్ధత అని ఆయన గుర్తు చేశారు. తెలంగాణలో 56.36 శాతం బలహీనవర్గాలు ఉన్నాయని వివరించారు. లోక్‌సభలో ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ చెప్పినట్లే.. తెలంగాణలో కులగణన చేశామన్నారు. గతేడాది ఫిబ్రవరి 4న కేబినెట్‌లో తీర్మానం చేశామని చెప్పారు.