Revanth Reddy : మంత్రులను తొలగిస్తేనే పాలనపై పట్టు ఉన్నట్లా : రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనపై వస్తున్న విమర్శలకు తగినట్లుగా స్పందించారు. తనకు పరిపాలనపై పట్టు లేదని కొందరు చెబుతున్నారని, మరి మంత్రులను తొలగిస్తేనా లేదా అధికారులను బదిలీ చేస్తే పట్టు ఉన్నట్టు చెప్పొచ్చా? అంటూ ప్రశ్నించారు. ఎలాంటి ఆరోపణలు లేకుండా ప్రభుత్వం ఉద్యోగాలను భర్తీ చేస్తోందని, పాలనలో పారదర్శకత కోసం ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నామని స్పష్టం చేశారు. తెలంగాణ అసెంబ్లీ ఆవరణలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి “రాజీవ్ యువ వికాసం” పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, తమ ప్రభుత్వం ఏర్పడిన తొలి ఏడాదిలోనే 54 వేలకు పైగా ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసినట్లు ప్రకటించారు. ఇంత భారీ సంఖ్యలో ఉద్యోగాలు ఇచ్చిన రాష్ట్రం మరొకటి లేదని గర్వంగా తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో అమలు అవుతున్న పథకాల వల్ల లక్షలాది కుటుంబాలు లబ్ధి పొందుతున్నాయని సీఎం వివరించారు. ముఖ్యంగా, స్వయం సహాయక సంఘాల్లో సభ్యులుగా ఉన్న 65 లక్షల మంది మహిళలకు త్వరలో నాణ్యమైన చీరలను పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. మహిళా సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు.

కులగణనపై కీలక ప్రకటన
స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా కులగణన చేపట్టలేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అయితే, సమాజానికి అసలైన ప్రతిబింబం ఎక్స్-రే లాంటి కులగణన ద్వారానే సాధ్యమని తెలిపారు. ఈ విషయాన్ని అగ్రహత్య నేత రాహుల్ గాంధీ కూడా స్పష్టంగా పేర్కొన్నారని చెప్పారు.
ఎస్సీ వర్గీకరణ ఉద్యమంపై స్పందన
మూడున్నర దశాబ్దాలుగా ఎస్సీ వర్గీకరణ కోసం పోరాటం జరుగుతోందని, తమ ప్రభుత్వం ఈ సమస్యను పట్టించుకుని తగిన చర్యలు తీసుకుంటోందని సీఎం పేర్కొన్నారు. అబద్ధాల పునాదుల మీద తమ ప్రభుత్వం నడవదని, ప్రజల అవసరాలను గుర్తించి వారికి న్యాయం చేసేలా పాలన సాగిస్తామని స్పష్టం చేశారు.
ఆదాయం పెంచిన కొత్త పాలన – అవినీతి తగ్గింపు
గత ప్రభుత్వం భారీ అవినీతి, దుబారాకు పాల్పడిందని సీఎం ఆరోపించారు. ముఖ్యంగా, ఇసుక విక్రయంలోనే రోజుకు రూ.3 కోట్లు అదనంగా ప్రభుత్వ ఖజానాకు వస్తోందని తెలిపారు. అంతే కాకుండా, రాష్ట్రంలో జీఎస్టీ వసూళ్లలో 17 శాతం పెరుగుదల నమోదైందని వెల్లడించారు. దీన్నిబట్టి, కొత్త ప్రభుత్వ పాలనలో ఆర్థిక పరిస్థితులు మెరుగుపడుతున్నాయని స్పష్టం చేశారు.