హైదరాబాద్: బుధవారం ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో బీసీ నేత ఆర్.కృష్ణయ్య మీడియాతో మాట్లాడారు. కులగణన లెక్కలపై ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశాన్ని ఏర్పాటు చేసిన సీఎం రేవంత్ రెడ్డి.. దానిని ఎందుకు చట్టం చేయలేదని ప్రశ్నించారు. రాష్ట్రంలోని బీసీలకు కేసీఆర్ కంటే ముఖ్యమంత్రి రేవంత్ ఎక్కువ అన్యాయం చేస్తున్నారని ఆర్.కృష్ణయ్య విమర్శించారు. బీసీలకు చట్టప్రకారం 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్రంలో జరిగిన కులగణనలో చాలా బీసీ కుటుంబాలు పాల్గొనలేదు. లేదంటే బీసీల సంఖ్య ఇంకా ఎక్కువగా ఉండేది. కులగణనపై చట్టం చేస్తే మేం సుప్రీంకోర్టులో పోరాడుతాం. రాజకీయాలు చేయడం మాకూ వచ్చు అని ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.

కాగా, లోకల్ బాడీ ఎన్నిక ల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్ కల్పిస్తామని సీఎం రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. అసెంబ్లీ వేదికగా సీఎం రేవంత్ చట్టబద్ధతతో పనిలేకుండా లోకల్ బాడీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున బీసీలకు 42శాతం సీట్లు కేటాయిస్తామని కుండబద్దలు కొట్టారు. బీఆర్ఎస్, బీజేపీలు సైతం 42 శాతం బీసీలకు టికెట్లు కేటాయిస్తారా? అని సీఎం రేవంత్ సవాల్ చేశారు. దీంతో ఇప్పుడు సీఎం సవాల్‌ను బీఆర్ఎస్, బీజేపీ స్వీకరిస్తుందా? బీసీలకు 42 శాతం సీట్లు ఇస్తుందా? అన్న చర్చ నడుస్తున్నది. తాజాగా ఈ అంశంపై ఆర్.కృష్ణయ్య స్పందించడం హాట్ టాపిక్‌గా మారింది.