తెలంగాణలో పదవీ విరమణ అనంతరం వివిధ విభాగాల్లో కొనసాగుతున్న విశ్రాంత ఉద్యోగుల తొలగింపు ప్రక్రియపై సీఎస్ శాంతికుమారి ప్రకటన చేశారు. అయితే, ప్రభుత్వ ఉత్తర్వులు ఉత్తముచ్చటేనా? లేక ఇందులో దాగున్న ఆంతర్యం వేరే ఉందా? అనే అంశంపై అధికార వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

ఉత్తర్వుల వెనుక వ్యూహం?
ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వంలో 6,729 మంది ఉద్యోగులు పదవీ విరమణ తర్వాత కూడా వివిధ విభాగాల్లో ఎక్స్‌టెన్షన్, రీఅపాయింట్‌మెంట్, కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ విధానాల్లో కొనసాగుతున్నారు. వీరిలో IAS స్థాయి ఉన్నతాధికారుల నుంచి, అటెండర్ల వరకు ఉద్యోగులు ఉన్నారు. సీఎస్ శాంతికుమారి ఇటీవల అన్ని శాఖలకు ఉత్తర్వులు జారీ చేస్తూ, ఈ నెల 31లోగా వారిని తొలగించాలని ఆదేశించారు. అయితే, ఈ ఉత్తర్వులోనే ఒక చిన్న మినహాయింపు ఇచ్చారు. ఏదైనా శాఖలో విశ్రాంత అధికారి సేవలు అత్యవసరం అనుకుంటే, ఆ శాఖ అధిపతి జస్టిఫికేషన్ ఇస్తే, ప్రభుత్వం తిరిగి నిర్ణయం తీసుకోవచ్చు అని పేర్కొన్నారు. ఈ వెసులుబాటుతో కొన్ని కీలకమైన నియామకాల విషయంలో ప్రభుత్వం తనకు అనుకూల అధికారులను కొనసాగించేందుకు అవకాశముందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఎక్స్‌టెన్షన్‌కు అడ్డుకట్ట లేదా ప్రత్యామ్నాయం?
ప్రభుత్వం ఎక్స్‌టెన్షన్ విధానానికి పూర్తిగా అడ్డుకట్ట వేయాలని నిర్ణయం తీసుకున్నా, ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు, మంత్రుల కార్యాలయాలు, కీలక బోర్డుల్లో పనిచేస్తున్న అధికారులకు మినహాయింపు ఇస్తుందా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ ఒక్క వెసులుబాటు ద్వారా కాంగ్రెస్ సర్కారు తమకు అనుకూల అధికారులను మళ్లీ యథాస్థానంలో కూర్చోబెట్టే అవకాశమున్నట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అసెంబ్లీ కార్యదర్శి నరసింహాచార్యులు, మెట్రో రైల్ ఎండీ ఎన్‌వీఎస్ రెడ్డి, మూసీ రివర్ ఫ్రంట్ చైర్మన్ సత్యనారాయణ, గనుల శాఖ అధికారి సుశీల్ కుమార్ వంటి ప్రముఖుల కొనసాగింపుపై అధికార వర్గాల్లో చర్చ జరుగుతోంది.
తొలగింపుతో యువతకు ఉద్యోగ అవకాశాలు?
నిరుద్యోగ జేఏసీ నాయకులు ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థిస్తూ, విశ్రాంత ఉద్యోగుల తొలగింపు ద్వారా యువతకు కొత్త ఉద్యోగాల్లో అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. ఒక్క విశ్రాంత అధికారికి చెల్లించే భారీ వేతనంతో నలుగురు కొత్త ఉద్యోగులను నియమించవచ్చు అని వారు వాదిస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయం వెనుక నిజమైన ఉద్దేశం ఏంటి? రాజకీయ వ్యూహాలేనా? లేదా నిజంగా ఆర్థిక పరంగా ఉత్తమ నిర్ణయమా? అనే అంశంపై సమయం వచ్చే వరకు స్పష్టత రాదు. అయితే, తెలంగాణలో కొత్త ప్రభుత్వ విధానాలపై దీర్ఘకాలిక ప్రభావం చూపించే నిర్ణయాల్లో ఇదొకటి అనేది స్పష్టమే. వివిధ శాఖల్లో కొనసాగుతున్న చాలా మంది రిటైర్డ్ అధికారులకు లక్షల్లో వేతనాలు చెల్లిస్తున్నారు. అలా ఒక్కరికి చెల్లించే వేతనంతో నలుగురు కొత్త ఉద్యోగులను ఆ శాఖలోకి ఎలాంటి ఆర్థికభారం లేకుండా తీసుకునే అవకాశాలు ఉన్నాయని నిరుద్యోగులు చెప్తున్నారు. ప్రభుత్వం నిజాయతీగా వ్యవహరించి, విశ్రాంత ఉద్యోగులు అందరినీ తొలగించి యువతకు కొత్త ఉద్యోగాల్లో అవకాశాలు కల్పించాలని నిరుద్యోగ జేఏసీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. అయితే ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులోనే వెసులుబాటు ఇచ్చారని సచివాలయవర్గాల్లో చర్చ నడుస్తున్నది.