నారా లోకేశ్ సమక్షంలో రెన్యూవబుల్ ఎనర్జీ రంగం టాటా పవర్ అనుబంధ సంస్థ టాటా పవర్ రెన్యూవబుల్ ఎనర్జీ లిమిటెడ్ (TPREL) మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మధ్య పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టుల అభివృద్ధికి అవగాహన ఒప్పందం (MOU) కుదిరింది. ఈ ఒప్పందంపై రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ సమక్షంలో సంతకాలు జరిగాయి. ఇది ఆంధ్రప్రదేశ్‌లో గ్రీన్ ఎనర్జీ లక్ష్యాలను ముందుకు తీసుకెళ్లేందుకు కీలకమైన ముందడుగు.ఈ ఒప్పందం ద్వారా రాష్ట్రంలో పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టుల అభివృద్ధికి మార్గం సుగమం కానుంది. టాటా పవర్ రెన్యూవబుల్ ఎనర్జీ లిమిటెడ్ మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంయుక్తంగా 7 గిగావాట్ల (7,000 మెగావాట్లు) పునరుత్పాదక ఇంధన అభివృద్ధి అవకాశాలను అన్వేషించనున్నారు. ఇందులో సౌర, వాయు, హైబ్రిడ్ ఎనర్జీ ప్రాజెక్టులు రాష్ట్రానికి రాబోతున్నాయి.
మంత్రి నారా లోకేశ్ స్పందన
ఈ సందర్భంగా మంత్రి నారా లోకేశ్ మాట్లాడుతూ, “రాష్ట్రాన్ని రెన్యూవబుల్ ఎనర్జీ రంగంలో ముందుకు తీసుకెళ్లేందుకు టాటా పవర్ లాంటి ప్రముఖ సంస్థల భాగస్వామ్యం ఎంతో అవసరం. ఈ ఒప్పందం ద్వారా భారీ స్థాయిలో పెట్టుబడులు రాబోతున్నాయి. రెన్యూవబుల్ ఎనర్జీ రంగంలో రూ. 10 లక్షల కోట్ల పెట్టుబడులతో 160 గిగావాట్ల విద్యుత్ ఉత్పత్తిని సాధించడమే మా లక్ష్యం,” అని తెలిపారు.ఈ ఒప్పందం ద్వారా గ్రీన్ ఎనర్జీ రంగంలో భారీ పెట్టుబడులు రానుండటంతో పాటు, పెద్ద సంఖ్యలో ఉద్యోగ అవకాశాలు కూడా లభించనున్నాయి. ప్రభుత్వ లెక్కల ప్రకారం, రానున్న ఐదేళ్లలో ఈ రంగంలో దాదాపు 7.5 లక్షల ఉద్యోగ అవకాశాలు సృష్టించబడతాయి. ఈ ప్రాజెక్టులు రాష్ట్రానికి దీర్ఘకాలిక ఆర్థిక మరియు పర్యావరణ ప్రయోజనాలను అందించనున్నాయి.
టాటా పవర్ రెన్యూవబుల్ ఎనర్జీ ప్రతినిధుల స్పందన
టాటా పవర్ రెన్యూవబుల్ ఎనర్జీ లిమిటెడ్ సీఈవో, మేనేజింగ్ డైరెక్టర్ దీపేష్ నందా మాట్లాడుతూ, “ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో భాగస్వామ్యం కావడం మాకు గర్వకారణం. ఈ ఒప్పందం ద్వారా మేము రాష్ట్రంలో పర్యావరణ హితమైన ప్రాజెక్టులను చేపట్టాలని భావిస్తున్నాం. క్లీన్ ఎనర్జీ విస్తరణను వేగవంతం చేయడమే మా లక్ష్యం,” అని తెలిపారు.ఈ కార్యక్రమంలో టాటా రెన్యూవబుల్ ఎనర్జీ సీఎఫ్ఓ అమిత్ మిమానీ, గ్రూప్ హెడ్ (ప్లానింగ్ రెన్యూవబుల్స్) తాహేర్ లోకానంద్ వాలా, లీడ్ (స్ట్రాటజీ) గరిమా చౌదరి, రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, ఏపీ ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ విజయానంద్, NREDCAP ఎండీ కమలాకర్ బాబు, జనరల్ మేనేజర్ (విండ్ & సోలార్) కె. శ్రీనివాస్ పాల్గొన్నారు.
గ్రీన్ ఎనర్జీ లక్ష్యాల దిశగా మరో అడుగు
ఈ ఒప్పందం ద్వారా రాష్ట్రంలో క్లీన్ ఎనర్జీ ప్రాజెక్టుల వేగవంతమైన అభివృద్ధికి మార్గం సుగమం కానుంది. రాష్ట్ర ప్రభుత్వ ఆకాంక్షల ప్రకారం, ఈ ప్రాజెక్టుల ద్వారా స్వచ్ఛమైన ఇంధన ఉత్పత్తి పెరగడంతో పాటు, విద్యుత్ సరఫరా వ్యవస్థ మరింత బలోపేతం కానుంది. టాటా గ్రూప్‌తో దీర్ఘకాలిక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసే ఈ ఒప్పందం, రాష్ట్ర అభివృద్ధికి పెద్ద దోహదం చేయనుంది.