ముందస్తు బెయిల్ ఇచ్చిన సుప్రీంకోర్టు
హైదరాబాద్: సినీ నటుడు మోహన్‌బాబుకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. జర్నలిస్టుపై దాడి కేసులో ఆయనకు సుప్రీంకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. జల్‌పల్లిలోని మోహన్ బాబు నివాసం వద్ద మీడియా ప్రతినిధిపై దాడి చేయడంపై పహాడీషరీఫ్ పోలీసులు మోహన్ బాబుపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు. ఈ ఘటనలో మొదట ఆయనపై బీఎన్‌ఎస్ 118(1) సెక్షన్ కింద కేసు నమోదు చేసిన పోలీసులు.. లీగల్ ఒపీనియన్ తీసుకున్న తర్వాత 109 సెక్షన్ కింద కేసు రిజిస్టర్ చేసి.. హత్యాయత్నం కేసుగా మార్చారు.

ఈ దాడి ఘటనలో గాయపడ్డ జర్నలిస్ట్‌కు మోహన్ బాబు క్షమాపణలు చెప్పారు. ఈ మేరకు ఓ లేఖ కూడా విడుదల చేశారు. ఈ ఘటనలో ఓ జర్నలిస్ట్ సోదరుడు గాయపడటం నాకు బాధ కలిగించింది. ఈ ఘటన తర్వాత అనారోగ్యం కారణంగా 48 గంటల పాటు ఆసుపత్రిలో చేరడంతో వెంటనే స్పందించలేకపోయా. ఆ రోజు నా ఇంటిగేటు విగిరిపోయింది.. దాదాపు 30 నుంచి 50 మంది వ్యక్తులు ఇంట్లోకి చొచ్చుకొచ్చారని.. ఆ సమయంలో సహనాన్ని కోల్పోయినట్లు లేఖలో వివరించారు.
పరిస్థితి అదుపు చేసే క్రమంలో జర్నలిస్ట్‌కు గాయమైందని.. ఇది చాలా దురదృష్టకరమన్నారు. అతడికి, ఆయన కుటుంబానికి కలిగిన బాధకు తాను తీవ్రంగా చింతిస్తున్నట్లు చెప్పారు. గాయపడ్డ జర్నలిస్ట్ త్వరగా కోలుకోవాలని మోహన్‌బాబు కాంక్షించారు. ఇకపోతే..సంక్రాంతి సందర్భంగా తిరుపతిలోని మోహన్ బాబు యూనివర్శిటీ వద్ద కూడా హై డ్రామా నడిచింది. ఇరు పక్షాల బౌన్సర్లు కొట్టుకున్నారు. చివరకు పోలీసుల అనుమతితో క్యాంపస్ లోపల ఉన్న తన తాత, నానమ్మల సమాధులను మనోజ్ దర్శించుకుని బయటకు వచ్చారు.