తెలంగాణ రైతులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రైతు భరోసా పథకం కింద సోమవారం (ఫిబ్రవరి 10న) భారీగా నిధులను విడుదల చేసింది. 2 ఎకరాల వరకు సాగు భూమి కలిగిన రైతులకు రూ.2223.46 కోట్లను ప్రభుత్వం అకౌంట్లలో జమ చేసింది. ఇప్పటి వరకు 34,75,994 మంది రైతుల ఖాతాల్లో నిధులు జమ చేయడం పూర్తి అయింది. మొత్తం 37 లక్షల ఎకరాలకు రైతు భరోసా నిధులు విడుదలైనట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.
ఈ పథకాన్ని జనవరి 26న సీఎం రేవంత్ రెడ్డి అధికారికంగా ప్రారంభించారు. ప్రారంభ దశలో కొన్ని గ్రామాల్లోని రైతులకు మాత్రమే నిధులు జమ చేయగా, ఇప్పుడు విడతలవారీగా రైతులకు పెట్టుబడి సాయం అందిస్తోంది. జనవరి 27న మొదటి విడతలో 4,41,911 మంది రైతులకు రూ.5689.99 కోట్లు విడుదల కాగా, ఫిబ్రవరి 5న 17,03,419 మంది రైతులకు రూ.5575.40 కోట్లు అందించారు. తాజాగా ఫిబ్రవరి 10న 8,65,999 మంది రైతులకు రూ.7075.48 కోట్లను జమ చేసినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ, బీఆర్ఎస్ పాలనలో పదేళ్లుగా రైతులు తీవ్రంగా నష్టపోయారని ఆరోపించారు. గత ప్రభుత్వ హయాంలో రైతుల కష్టాలు పెరిగాయని, నష్టాలను భరించలేక రైతుల ఆత్మహత్యలు కూడా పెరిగాయని ఆయన అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఒక్క ఏడాదిలోనే రైతులకు అండగా నిలిచిందని, రైతు భరోసా ద్వారా వారికి ఆర్థికంగా సహాయం అందజేస్తున్నట్లు తెలిపారు.
మంత్రి తుమ్మల నాగేశ్వరరావు బీఆర్ఎస్ నేత కేటీఆర్‌పై తీవ్ర విమర్శలు చేశారు. రైతు సంక్షేమాన్ని అడ్డుకోవడానికి కేటీఆర్ కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. “కేసీఆర్ హయాంలో రైతులకు మిగిలిన గౌరవాన్ని కూడా కేటీఆర్ పోగొడుతున్నారు” అంటూ విమర్శించారు. వ్యవసాయ రంగంపై రాజకీయ కుట్రలు చేయడం సరికాదని హెచ్చరించారు.
తెలంగాణలో రైతు భరోసా పథకం ద్వారా లక్షలాది మంది రైతులకు ప్రయోజనం చేకూరనుంది. ప్రభుత్వం తక్కువ భూమి ఉన్న రైతులకు మొదటి దశలో, ఆపై పెద్ద భూమి కలిగిన రైతులకు నిధులు విడుదల చేస్తోంది. వ్యవసాయ రంగంలో ప్రభుత్వ సహకారం మరింత పెరుగుతుందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.