ముంబయి : బాలీవుడ్ స్టార్ నటుడు, రియల్ హీరో సోను సూద్.. కరోనా కష్టకాలంలో తన పెద్ద మనసు చాటుకున్న విషయం తెలిసిందే. ఎంతో మందికి తనవంతు సాయం చేసి రియల్ హీరోగా పేరు తెచ్చుకున్నారు. ఆ సమయంలో నెటిజన్లు సైతం సోనూని దేవుడిలా ట్రీట్ చేశారు. ఈ క్రమంలో సోను సూద్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తారన్న ప్రచారం కూడా జరిగింది. ఆ ప్రచారంపై సోను సూద్ తాజాగా స్పందించారు.
మూవీ ప్రొమోషన్స్‌లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సోను సూద్ మాట్లాడుతూ.. కొవిడ్ సమయంలో ప్రజలకు సాయం చేసినందుకు గానూ తనకు సీఎం, డిప్యూటీ సీఎం, రాజ్యసభ సభ్యుడు అయ్యే అవకాశాలు వచ్చాయని తెలిపారు. అయితే, ఆ అభ్యర్థనలను తాను సున్నితంగా తిరస్కరించినట్లు చెప్పుకొచ్చారు. ‘నాకు సీఎం ఆఫర్ వచ్చింది. నేను నిరాకరించడంతో డిప్యూటీ సీఎంని చేస్తానని చెప్పారు. జాతీయ నాయకులు నాకు రాజ్యసభ సీటు కూడా ఆఫర్ చేశారు. అయితే, ఆ ఆఫర్లను నేను తిరస్కరించాను. స్వేచ్ఛను కోల్పోవడం నాకు ఇష్టం లేదు. అందుకే రాజకీయాలకు దూరంగా ఉండాలని అనుకుంటున్నా’ అని ఈ రియల్ హీరో తెలిపారు.
ప్రజలు రెండు కారణాల వల్ల రాజకీయాల్లోకి వస్తారని సోను సూద్ అభిప్రాయం వ్యక్తం చేశారు. ‘ప్రజలు రెండు కారణాల వల్ల రాజకీయాల్లోకి వస్తారు. ఒకటి డబ్బు సంపాదించడం కోసం లేదా అధికారం కోసం. వాటిలో దేనిపైనా నాకు ఆసక్తి లేదు. ప్రజలకు సాయం చేయడం కోసం రాజకీయాల్లోకి రావాలనుకుంటే.. అది నేను ఇప్పటికే చేస్తున్నాను’ అని పేర్కొన్నారు.