వాడివదిలిన జీన్స్ ప్యాంట్లు పక్కన పడేశారా? ఇకనుంచి అలా చేయకండి. ఎందుకంటే, ఐఐటీ ఢిల్లీ (IIT Delhi) పరిశోధకులు పాత డెనిమ్ వస్త్రాలను (Old denim clothes) ఉపయోగించి కొత్తగా మృదువైన దుస్తులు తయారు చేసే వినూత్న టెక్నాలజీని అభివృద్ధి చేశారు. పర్యావరణాన్ని కాపాడడంలో ఇది ఒక గేమ్‌చేంజర్ కావొచ్చు.భారత్‌లో ప్రతి సంవత్సరం దాదాపు 39 లక్షల టన్నుల వస్త్ర వ్యర్థాలు ఉత్పత్తి అవుతున్నాయి. అయితే వాటిలో కేవలం 4 శాతం మాత్రమే రీసైకిల్ అవుతోంది. మిగిలినవన్నీ చెత్తగా మారి భూమికి భారంగా మారుతున్నాయి. ఈ పరిస్థితే పరిశోధకులకు ప్రేరణగా మారింది.ఇప్పటి వరకూ ఉన్న వస్త్ర రీసైక్లింగ్ పద్ధతుల్లో దారాల బలహీనత, రంగు మార్పులు, స్పర్శలో తేడాలు కనిపిస్తున్నాయి. కానీ, ఐఐటీ ఢిల్లీ పరిష్కారం అందించిన కొత్త విధానం వీటన్నింటినీ అధిగమించింది. ఇది కేవలం పాత జీన్స్‌కే కాదు, భవిష్యత్తులో మరిన్ని వస్త్రాలకు వర్తించనుంది.

నాణ్యత తగ్గకుండా కొత్త దుస్తులు
పరిశోధకులు రీసైకిల్ నూలుతో నిట్టెడ్ గార్మెంట్స్ తయారు చేశారు. ఇందులో 50 శాతం వరకు రీసైకిల్ డెనిమ్ ఫైబర్ వాడినప్పటికీ, దుస్తుల నాణ్యతలో అసలు తేడా కనిపించలేదని తెలిపారు. స్పర్శకు మృదువుగా, మౌలికంగా బలంగా ఉండేలా రూపొందించడంలో విజయం సాధించారు.డెనిమ్ నుంచి రీసైకిల్ చేసిన నూలు కొద్దిగా గరుకుగా ఉంటుంది. కానీ, ఐఐటీ బృందం ప్రత్యేకంగా రూపొందించిన ‘సాఫ్ట్‌నెస్ ట్రీట్‌మెంట్’ ఈ సమస్యను పరిష్కరించింది. దీని వల్ల ఈ దుస్తులు అసలు కొత్తదేనేమో అనేంత మృదుత్వం ఉంటుందని వారు వెల్లడించారు.
సీమ్‌లెస్ హోల్ గార్మెంట్ టెక్నాలజీతో తయారీ
ఈ దుస్తుల తయారీలో ‘సీమ్‌లెస్ హోల్ గార్మెంట్ టెక్నాలజీ’ను వాడారు. ఇది శరీరానికి బాగా సరిపడేలా, ముడులు లేకుండా దుస్తులను అల్లే ప్రక్రియ. దీని వల్ల వేసుకునే వారికి మరింత కంఫర్ట్ కలుగుతుంది.ఈ టెక్నాలజీ వల్ల గ్రీన్‌హౌస్ వాయువుల ఉద్గారాలు 30-40 శాతం తగ్గుతాయి. శిలాజ ఇంధనాల వినియోగం కూడా తగ్గుతుంది. ముఖ్యంగా ఓజోన్ పొర నష్టం 60 శాతం వరకు తగ్గుతుందని పరిశోధకులు విశ్లేషించారు. ఈ విధానం వల్ల కొత్త పత్తి సాగు అవసరం తగ్గుతుంది. దాంతో పాటు పురుగుమందులు, నీటి వినియోగం కూడా భారీగా తగ్గుతుంది.
వస్త్ర వ్యర్థాల రీసైక్లింగ్‌పై మరిన్ని అధ్యయనాలు
ఇది మొదటి అడుగే అని ఐఐటీ ఢిల్లీ ప్రొఫెసర్ బీఎస్ బుటోలా తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని రకాల వస్త్ర వ్యర్థాలను రీసైకిల్ చేసే మార్గాలపై పరిశోధనలు కొనసాగుతున్నాయని వెల్లడించారు.
Read Also : President of Russia : పుతిన్ కు మోదీ ఫోన్.. భారత పర్యటనకు ఆహ్వానం