శ్రీశైలం ఎడమ గట్టు కాలువ టన్నెల్‌లో జరిగిన ప్రమాదం దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనాన్ని కలిగించింది. ఈ ప్రమాదంలో 8 మంది ఇంజనీర్లు మరియు కార్మికులు టన్నెల్‌లో చిక్కుకుపోయారు.టన్నెల్‌లో పేరుకుపోయిన బురద, శిథిలాలను తొలగించేందుకు సాంకేతిక పరికరాలను ఉపయోగిస్తున్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ చర్యలు ఇప్పటికే 18వ రోజుకు చేరుకున్నాయి. కేరళ నుంచి ప్రత్యేకంగా తీసుకువచ్చిన కడావర్ డాగ్స్ మృతదేహాలను గుర్తిస్తున్నప్పటికీ, వాటిని బయటికి తీసుకురావడంలో సహాయక బృందాలు అనేక సవాళ్లు ఎదుర్కొంటున్నాయి. టన్నెల్ లోపల మృతదేహాలు పూర్తిగా కుళ్లిపోయి ఉండటమే కాకుండా, బోరింగ్ మెషీన్ భారీ భాగాలు అడ్డుగా ఉండటంతో సహాయక చర్యలు మరింత సంక్లిష్టంగా మారాయి.
ఇప్పటివరకు వెలికితీసిన మృతదేహాలు
ఇప్పటివరకు గల్లంతైన కార్మికులలో గురుప్రీత్ సింగ్ అనే మెషీన్ ఆపరేటర్ మృతదేహాన్ని వెలికితీశారు. నిన్న మరో రెండు మృతదేహాలు గుర్తించినప్పటికీ, వాటిని వెలికితీయడంలో అవాంతరాలు ఎదురవుతున్నాయి.బోరింగ్ మెషీన్ భాగాలు అడ్డుగా ఉండటంతో రెస్క్యూ బృందాలు గ్యాస్ కట్టర్లను ఉపయోగించి వాటిని తొలగించేందుకు ప్రయత్నిస్తున్నాయి.
రంగంలోకి రోబోలు
సహాయక చర్యలను వేగవంతం చేసేందుకు ఇవాళ ప్రత్యేకంగా రోబోలను కూడా వినియోగిస్తున్నట్లు తెలుస్తోంది. టన్నెల్ లోపల ఆక్సిజన్ సరఫరా తగ్గిపోవడం, వాయువు సరిగ్గా లేకపోవడంతో సహాయక బృందాల ప్రాణాలకు ముప్పు ఏర్పడుతోంది. ఈ నేపథ్యంలో రోబోలు ముందుకు పంపి పరిస్థితిని అంచనా వేయాలని అధికారులు నిర్ణయించారు.18 రోజులుగా కొనసాగుతున్న సహాయక చర్యల్లో అనేక అడ్డంకులు ఎదురయ్యాయి. టన్నెల్ లోపల బోరింగ్ మెషీన్ లోని మెటల్ భాగాలు అడ్డుగా ఉండటం వంటి అంశాలు సహాయక చర్యలను కష్టతరం చేశాయి.

జీపీఆర్ రాడార్, ఆక్వా-ఐ పరికరాలను గుర్తించినా,గల్లంతైన వారిని గుర్తించడం సాధ్యం కాలేదు.కేరళ పోలీసులు వినియోగించే క్యాడవర్ డాగ్స్‌ను రప్పించారు. బెల్జియం మెలినోయిస్ జాతికి చెందిన మాయ, మార్ఫి అనే శునకాలను కేరళ బృందాలు రంగంలోకి దింపాయి. కేరళలో ప్రకృతి వైపరీత్యాలు, కొండచరియలు విరిగిపడే ప్రమాదాలు ఎక్కువగా ఉండడంతో సుమారు 17 శునకాలను కొనుగోలు చేసి, వాటికి మానవ అవశేషాలను గుర్తించడంలో శిక్షణనిచ్చారు. ఇవి మానవ, జంతు కళేబరాల అవశేషాలను వేర్వేరుగా గుర్తిస్తాయి. నెలలు, సంవత్సరాలు దాటి ఎముకలు మాత్రమే భూగర్భంలో ఉన్నాఇవి గుర్తిస్తాయి.16 రోజుల తర్వాత ఒకరి మృతదేహం బయటపడగా, మిగిలిన వారి కోసం ఇవాళ్టి నుంచి సహాయక చర్యలు మరింత ముమ్మరం కానున్నాయి. బయట పడిన గురుప్రీత్ సింగ్, రాబిన్స్ కంపెనీలో టన్నల్ బోరింగ్ మిషన్ ఆపరేటర్‌గా పని చేసే వాడు. వాస్తవానికి టీబీఎం కట్టర్‌కు వెనక భాగంలో మిషన్‌ను ఆపరేట్ చేసే ప్రాంతంలో ఆపరేటర్లు ఉండాలి.