రాబోయే సాధారణ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ (Nitin Gadkari) చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతున్నాయి. “ఇప్పటివరకు ప్రజలు చూసింది కేవలం ఒక న్యూస్ రీల్ మాత్రమే. అసలైన సినిమా ఇంకా మొదలు కాలేదు” అంటూ గడ్కరీ వ్యాఖ్యానించారు. పార్టీ ఏ బాధ్యత అప్పగించినా సమర్థవంతంగా నిర్వర్తించడానికి తాను సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు. పార్టీలో తన భవిష్యత్ పాత్రపై స్పష్టత లేకపోయినా, సమయానుకూలంగా చర్యలు ఉంటాయన్న సంకేతాలు ఇస్తున్నారు.
వ్యవసాయం, సామాజిక సేవలపై దృష్టి
గడ్కరీ తాజా ఇంటర్వ్యూలో వ్యవసాయం మరియు సామాజిక సేవల పట్ల తన మక్కువను వెల్లడించారు. గత 11 ఏళ్లుగా ప్రధానంగా రహదారుల అభివృద్ధిపై దృష్టి పెట్టిన గడ్కరీ, ఇప్పుడు రైతుల సమస్యలపై మరింత దృష్టి సారిస్తున్నట్లు తెలిపారు. ప్రత్యేకించి మహారాష్ట్రలోని విదర్భ ప్రాంతంలో రైతుల ఆత్మహత్యలు నివారించాలన్నదే తన ప్రధాన ఆకాంక్షగా పేర్కొన్నారు. రైతులకు ఉపాధి, వ్యవసాయ ఆదాయం పెరిగేలా చర్యలు తీసుకోవడం ఇప్పుడు తన ప్రాధాన్యతగా పేర్కొన్నారు.
జనాభా నియంత్రణపై స్పష్టమైన వ్యాఖ్యలు
దేశ అభివృద్ధిలో జనాభా నియంత్రణ కీలక అంశమని గడ్కరీ పేర్కొన్నారు. జనాభా నియంత్రణను మతపరంగా కాకుండా ఆర్థిక కోణంలో చూడాలని సూచించారు. “భారత్ తలసరి ఆదాయంలో టాప్ 10 దేశాల్లో లేకపోవడానికి ప్రధాన కారణం జనాభా విస్తృతి” అని విశ్లేషించారు. అభివృద్ధి చెందిన పథకాలు జనాభా పెరుగుదల కారణంగా అందరికీ సమంగా ఉపయోగపడటం కష్టమని అభిప్రాయపడ్డారు. ప్రధాని మోదీ నేతృత్వంలో భారత్ అనేక రంగాల్లో ప్రగతిని సాధించిందని, ఆ దిశగా భవిష్యత్తులో కూడా ముందడుగు వేయాల్సిన అవసరం ఉందని గడ్కరీ స్పష్టం చేశారు.
Read Also : Shah Rukh Khan షారుఖ్ ఖాన్ భవంతిని తనిఖీ చేసిన అధికారులు…