తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు ప్రక్రియను మరింత సులభతరం చేసింది. ఇకపై లబ్ధిదారులు తమ సమీపంలోని మీ సేవా కేంద్రాల్లో రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకోవచ్చు. పౌరసరఫరాల శాఖ ఈ మేరకు మీ సేవ కమిషనర్‌కు సూచనలు ఇచ్చింది. గత పదేళ్లుగా కొత్త రేషన్ కార్డుల కోసం ప్రజలు ఎదురుచూస్తుండగా, ఇటీవల ప్రభుత్వం ఎంపిక చేసిన గ్రామాల్లో లక్షకు పైగా కొత్త కార్డులను మంజూరు చేసింది.
కొత్త రేషన్ కార్డులు మాత్రమే కాకుండా, ఇప్పటికే ఉన్న కార్డుల్లో మార్పులు, అప్‌డేట్లు చేసుకునే అవకాశం కూడా మీసేవ ద్వారా అందుబాటులోకి వచ్చింది. పేరు మార్పులు, చిరునామా మార్పులు, కుటుంబ సభ్యుల వివరాల అప్‌డేట్ వంటి సేవలు ఇకపై ఆన్‌లైన్ విధానంలో త్వరగా పూర్తి చేసుకోవచ్చు. లబ్ధిదారులు మీ సేవ కేంద్రాలను సందర్శించి, అవసరమైన అన్ని మార్పులను చేసుకోవచ్చని అధికారులు సూచించారు.

ఈ ప్రక్రియను సులభతరం చేయడానికి మీ సేవ కేంద్రాలను రేషన్ కార్డుల డేటాబేస్‌తో అనుసంధానం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే దరఖాస్తు చేసిన వారు మరోసారి దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. కొత్తగా దరఖాస్తు చేసుకోవాలనుకునే వారు మాత్రమే మీ సేవ కేంద్రాల్లో తమ వివరాలను అందజేయాలని సూచించింది. తెలంగాణ ప్రభుత్వం ఇటీవల రేషన్ కార్డుల మంజూరుకు మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈ ప్రక్రియ నిరంతరంగా కొనసాగుతుందని, నిర్దిష్ట గడువు విధించలేదని అధికారులు తెలిపారు. అర్హత కలిగిన ప్రతి ఒక్కరికీ రేషన్ కార్డులు అందజేయడానికి ప్రభుత్వం పూర్తిగా సిద్ధంగా ఉంది.
ప్రజలు ఆందోళన చెందకుండా, మీ సేవ కేంద్రాల్లో తగిన ధ్రువపత్రాలతో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. రేషన్ కార్డుల ద్వారా పేద ప్రజలు పలు ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల ప్రయోజనాలను పొందే అవకాశముంది. కాబట్టి, అర్హత కలిగిన వారు త్వరగా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు.