Bajinder Singh : అత్యాచారం కేసులో పంజాబ్‌కు చెందిన ప్రముఖ మతబోధకుడు, సోషల్‌మీడియా ఇన్‌ప్లుయెన్సర్ బాజిందర్ సింగ్‌కు జీవితఖైదు శిక్ష పడింది. ఈ కేసు లో నిందితులుగా ఉన్న మరో ఐదుగురిని న్యాయస్థానం నిర్దోషులుగా తేల్చింది. 2018లో ఓ యువతిపై లైంగిక వేధింపులకు పాల్పడినందుకు గానూ ఇటీవల బాజిందర్ సింగ్‌ని దోషిగా తేల్చిన మొహాలీ కోర్టు.. తాజాగా శిక్ష ఖరారు చేసింది. బాజిందర్ సింగ్‌కు జీవితఖైదు విధిస్తూ మంగళవారం తీర్పు వెలువరించింది.

విదేశాలకు తీసుకెళ్తానని ఆశపెట్టి
జిరాక్‌పుర్‌కు చెందిన ఓ మహిళ 2018లో బాజిందర్ సింగ్ తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. విదేశాలకు తీసుకెళ్తానని ఆశపెట్టి అతడు తనను ఇంటికి ఆహ్వానించాడని బాధితురాలు తెలిపింది. అక్కడ తనపై లైంగిక దాడికి పాల్పడి.. ఆ దృశ్యాలను రికార్డ్ చేశాడని ఆరోపించింది. అతడి డిమాండ్లకు అంగీకరించకపోతే ఆ వీడియోను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తానని బెదిరించినట్లు తెలిపింది. ఆమె ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఇటీవల దిల్లీ ఎయిర్‌పోర్టులో అతడిని అరెస్టు చేశారు. అనంతరం విచారణ జరిపిన కోర్టు.. అతడిని దోషిగా తేల్చి జీవితఖైదు విధించింది.
కపుర్తలాకు చెందిన మరో యువతి ఆరోపణలు
ఈ ఏడాది ఫిబ్రవరిలో కపుర్తలాకు చెందిన మరో యువతి బాజిందర్ సింగ్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేస్తూ పోలీసులను ఆశ్రయించింది. దీంతో అతడిపై పలు కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలోనే ఇటీవల బాజిందర్‌కు సంబంధించిన ఓ వీడియో వైరల్‌గా మారింది. తన ఆఫీసులో ఉన్న వారిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. వాళ్లపై వస్తువులు విసిరేస్తూ హంగామా సృష్టించాడు. అక్కడితో ఆగకుండా ఓ యువకుడితోపాటు మహిళలపైనా చేయి చేసుకున్న దృశ్యాలు బయటికొచ్చాయి.