తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్ యాప్స్ కేసు రోజు రోజుకూ కొత్త మలుపులు తిరుగుతోంది. ఈ యాప్స్‌ను ప్రోత్సహించిన వారిపై తెలంగాణ పోలీసులు సీరియస్‌గా దృష్టి సారించారు. ఇప్పటికే సినీ ప్రముఖులు, యూట్యూబర్లు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లు సహా అనేక మందిపై కేసులు నమోదయ్యాయి. తాజాగా మియాపూర్ పోలీసులు 25 మంది సెలబ్రిటీలపై కేసు నమోదు చేయడం పెద్ద సంచలనంగా మారింది.

ఎవరెవరు ఈ వివాదంలో ఉన్నారు?
తెలంగాణ పోలీసులు మొదట 11 మంది సెలబ్రిటీలపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. అయితే ప్రదీప్ శర్మ అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు కేసు తీవ్రత పెరిగింది. టాలీవుడ్ హీరోలు దగ్గుబాటి రానా, విజయ్ దేవరకొండ పేర్లు ఇందులో ప్రధానంగా వినిపిస్తున్నాయి. వారితో పాటు టాలీవుడ్ నటీనటులు, యాంకర్లు, యూట్యూబర్లు మొత్తం 25 మంది జాబితాలో ఉన్నారు. కేసు నమోదైన వారిలో సినీ నటులు, యాంకర్లు, యూట్యూబ్ ఇన్‌ఫ్లూయెన్సర్లు ఉన్నారు. వీరిలో కొన్ని ప్రముఖ పేర్లు ఇవే- ప్రకాశ్ రాజ్, మంచు లక్ష్మి, ప్రణీత సుభాష్, శ్రీముఖి, రీతూ చౌదరి, యాంకర్ శ్యామల, విష్ణుప్రియ, వర్షిణి, అనన్య నాగళ్ల, సిరి హనుమంతు, వసంతి కృష్ణన్, శోభా శెట్టి, అమృత చౌదరి, నయని పావని, నేహా పఠాన్, పద్మావతి, పండు, ఇమ్రాన్ ఖాన్, హర్ష సాయి, బయ్యా సన్నీ యాదవ్, టేస్టీ తేజ, బండారు సుప్రీత.
పోలీసుల విచారణ
పంజాగుట్ట పోలీస్ స్టేషన్ ఎదుట యూట్యూబర్ టేస్టీ తేజ హాజరయ్యారు. గురువారం యాంకర్ విష్ణుప్రియ కూడా విచారణకు వెళ్లారు. అయితే ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న యూట్యూబర్లు హర్ష సాయి, పరేషాన్ భాయ్స్ ఇమ్రాన్ భయంతో దుబాయ్‌కు పారిపోయారని ప్రచారం జరుగుతోంది. ఈ వ్యవహారంపై కొంత మంది సెలబ్రిటీలు తమ ప్రమోషన్లు కేవలం బ్రాండ్ అసోసియేషన్ మాత్రమేనని అంటున్నారు. అయితే తెలంగాణ పోలీసులు దీన్ని సీరియస్‌గా తీసుకుని, కేసులను మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ బెట్టింగ్ యాప్స్ కేసు టాలీవుడ్ పరిశ్రమలో కలకలం రేపుతుండగా, మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.