Tahawwur Rana : మరికొన్ని గంటల్లో 26/11 ముంబయి దాడుల్లో కీలక సూత్రధారి తహవ్వుర్ రాణాను తరలిస్తోన్న విమానం భారత్‌కు రానుంది. ఈ నేపథ్యంలో కేంద్రప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసును వాదించేందుకు స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా నరేందర్ మాన్‌ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మూడు సంవత్సరాల కాలానికి లేకపోతే ట్రయల్ పూర్తయ్యేవరకు ఢిల్లీలోని ఎన్‌ఐఏ ప్రత్యేక న్యాయస్థానాలు, అప్పిలేట్ కోర్టుల్లో జాతీయ దర్యాప్తు సంస్థ తరఫున వాదనలు వినిపించనున్నారు. ఏది ముందుగా పూర్తయితే దానిని పరిగణనలోకి తీసుకుంటారు.

రాణా పాకిస్థాన్‌కు చెందిన కెనడా జాతీయుడు
26/11 ముంబయి దాడుల్లో కీలక సూత్రధారి అయిన తహవ్వుర్ రాణా పాకిస్థాన్‌కు చెందిన కెనడా జాతీయుడు. ఉగ్రవాద కార్యకలాపాల్లో పాల్గొన్నాడన్న ఆరోపణలపై 2009లో అరెస్టయ్యాడు. అమెరికా జైల్లో శిక్ష అనుభవించిన అతడిని అప్పగింత ప్రక్రియలో భాగంగా ప్రస్తుతం భారత్‌కు తీసుకువస్తున్నారు. బుధవారం రాత్రి 7:10 గంటలకు ప్రత్యేక విమానంలో తహవ్వుర్‌ను తీసుకుని అధికారులు ఇండియాకు బయలుదేరారు. గురువారం మధ్యాహ్నం వీరు ఇక్కడికి చేరుకునే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడికి వచ్చాక అతడిని ఎన్‌ఐఏ అధికారికంగా అరెస్టు చేసి.. ఢిల్లీలోని తిహాడ్ జైలుకు తరలించనున్నట్లు సమాచారం.
ఈ ఘటనల్లో 18 మంది భద్రత సిబ్బంది
2008 నవంబర్ 26న 10 మంది పాకిస్థానీ ఉగ్రవాదులు సముద్ర మార్గం ద్వారా ముంబయికి చేరుకుని.. సీఎస్‌ఎంటీ, ఒబెరాయ్ ట్రైడెంట్, తాజ్ హోటల్ తదితర ప్రాంతాల్లో దాడులకు పాల్పడ్డారు. నవంబర్ 29 వరకు మారణహోమం కొనసాగింది. ఈ ఘటనల్లో 18 మంది భద్రత సిబ్బంది సహా 166 మంది ప్రాణాలు కోల్పోయారు. అనేక మంది గాయపడ్డారు. అప్పటి యాంటీ టెర్రరిజం స్క్వాడ్ (ఏటీఎస్) చీఫ్ హేమంత్ కర్కరే, ఆర్మీ మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్, ముంబయి అదనపు పోలీస్ కమిషనర్ అశోక్ కామ్టే, సీనియర్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ విజయ్ సలాస్కర్‌లు అమరులయ్యారు.
Read Also: వడ్డీ రేట్లు తగ్గించిన 4 బ్యాంకులు