కేంద్ర ఎన్నికల సంఘం చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ పదవీకాలం మంగళవారం (ఫిబ్రవరి 18)నాటితో ముగుస్తోంది. ఆయన పదవీ విరమణ నేపథ్యంలో కొత్త సీఈసీ ఎంపిక కసరత్తు మొదలైంది. సోమవారం (నేడు) సాయంత్రం గం. 4.30కు సీఈసీని ఎంపిక చేసే అత్యన్నత స్థాయి సెలక్షన్ కమిటీ సమావేశం కానుంది. ప్రధాన మంత్రి, లోక్‌సభలో ప్రతిపక్ష నేత, కేంద్ర మంత్రివర్గం నామినేట్ చేసిన కేంద్ర మంత్రి ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారు. ప్రధాని మోదీ, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీతో పాటు ఈ సమావేశంలో యూనియన్ కేబినెట్ నామినీగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పాల్గొననున్నారు. ప్రధాని కార్యాలయంలో ఈ భేటీ జరగనుంది. ముగ్గురు నేతలు కలిసి సెర్చ్ కమిటీ తయారు చేసిన జాబితా నుంచి ఒకరిని చీఫ్ ఎలక్షన్ కమిషనర్‌గా ఎన్నుకుంటారు. ఆపై తమ నిర్ణయాన్ని రాష్ట్రపతికి సిఫార్సు చేస్తారు. అనంతరం రాష్ట్రపతి కొత్త సీఈసీ నియామక ఉత్తర్వులు జారీ చేస్తారు. గతంలో ఈ కమిటీలో భారత ప్రధాన న్యాయమూర్తి కూడా సభ్యుడిగా ఉండేవారు. అయితే రెండేళ్ల క్రితం కేంద్ర ప్రభుత్వం కొత్త చట్టాన్ని తీసుకొచ్చి హైలెవెల్ కమిటీని భారత ప్రధాన న్యాయమూర్తి స్థానంలో కేంద్ర మంత్రివర్గం నామినేట్ చేసే మంత్రికి స్థానం కల్పించింది.

చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అండ్ అదర్ ఎలక్షన్ కమిషనర్స్ (అప్పాయింట్మెంట్ కండిషన్స్ ఆఫ్ సర్వీస్ అండ్ టర్మ్ ఆఫ్ ఆఫీస్) యాక్ట్, 2023 పేరుతో కేంద్ర ప్రభుత్వం చట్టాన్ని తీసుకొచ్చింది. ఈ ప్రకారం కేంద్ర ఎన్నికల సంఘంలో చీఫ్ ఎలక్షన్ కమిషనర్, ఎలక్షన్ కమిషనర్లను ప్రధాని అధ్యక్షతన హైలెవెల్ కమిటీ సమావేశం చేసే సిఫార్సుల ఆధారంగా రాష్ట్రపతి నియమించాల్సి ఉంటుంది. ఈ చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత తొలిసారి కొత్త సీఈసీ నియామకం చేపట్టనున్నారు.
రేసులో ఎవరున్నారంటే!
కేంద్ర ఎన్నికల సంఘంలో చీఫ్ ఎలక్షన్ కమిషనర్‌తో పాటు మరో ఇద్దరు ఎలక్షన్ కమిషనర్లు ఉంటారు. గతంలో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ పదవీకాలం ముగిస్తే.. ఆయన తర్వాత సీనియర్‌గా ఉన్న ఎలక్షన్ కమిషనర్‌ను CEC గా నియమించేవారు. కానీ కొత్త చట్టం ప్రకారం కొత్త సీఈసీ మిగిలిన ఇద్దరు కమిషనర్లలో ఒకరు కావాల్సిన అవసరం లేదు. సెర్చ్ ప్యానెల్ ఐదుగురు సెక్రటరీ స్థాయి ఐఏఎస్ అధికారులతో ఒక జాబితాను రూపొందింస్తుంది. వారు విశ్రాంత ఉద్యోగులైనా కావొచ్చు లేదా సర్వీసులో ఉన్నవారైనా కావొచ్చు. వారిలో ఎవరో ఒకరిని ప్రధాన మంత్రి నేతృత్వంలోని హైలెవెల్ కమిటీ ఎంపిక చేసి రాష్ట్రపతికి సిఫార్సు చేయవచ్చు.
ఎలక్షన్ కమిషనర్లలో జ్ఞానేశ్ కుమార్ సీనియర్‌గా..
ప్రస్తుతం కేంద్ర ఎన్నికల సంఘంలో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ తర్వాత ఎలక్షన్ కమిషనర్లలో జ్ఞానేశ్ కుమార్ సీనియర్‌గా ఉన్నారు. ఆయన తర్వాత మరో ఎలక్షన్ కమిషనర్ సుఖ్‌బీర్ సింగ్ సంధు ఉన్నారు. జ్ఞానేశ్ కుమార్ పదవీకాలం 2029 జనవరి 26 వరకు ఉంది. ఒకవేళ సీనియారిటీ, ఎన్నికల నిర్వహణలో అనుభవాన్ని పరిగణలోకి తీసుకుంటే హైలెవెల్ కమిటీ సైతం ఆయన పేరునే సిఫార్సు చేసే అవకాశం ఉంది.
రాహుల్ గాంధీ నిర్ణయం ఎటు?
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో పలు అనుమానాలు
ఎన్నికల నిర్వహణ నిష్పక్షపాతంగా ఉండాలని ఎవరైనా కోరుకుంటారు. విధి నిర్వహణలో పక్షపాతం లేకుండా నిబద్ధతతో పనిచేసిన అధికారులకు ఈ బాధ్యతలు అప్పగించాలని చూస్తారు. అయితే ఈ మధ్యకాలంలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు చేస్తూ వచ్చారు. ముఖ్యంగా మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల విషయంలో అనేక సందేహాలు, అనుమానాలు లేవనెత్తుతూ మిత్రపక్షాలతో కలిసి నానా హంగామా చేశారు.