తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం మంత్రివర్గ విస్తరణకు సిద్ధమవుతుండగా, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. తనకు మంత్రి పదవి ఖాయమని, కాంగ్రెస్ అధిష్ఠానం ఆ మేరకు హామీ ఇచ్చిందని స్పష్టం చేశారు.

సీనియర్ నేత జానారెడ్డిపై రాజగోపాల్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. ధర్మరాజులా వ్యవహరించాల్సిన వారు ధృతరాష్ట్రుడిలా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. 30 ఏళ్ల పాటు మంత్రిగా పనిచేసిన జానారెడ్డి, ఇప్పుడే రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలకు పదవులు ఇవ్వాలని గుర్తుకు తెచ్చుకున్నారంటూ సెటైర్లు వేశారు.
తమ్ముడికి మంత్రి పదవి ఇవ్వకూడదా?
రాజగోపాల్ రెడ్డి అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఇప్పటికే మంత్రి పదవిలో ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తమ్ముడిగా తనకు మంత్రి పదవి రావడం సహజమేనని, దీనిపై ఎవరు రాజకీయాలు చేయవద్దని హితవు పలికారు. తనకు కూడా పదవి రావాల్సిన హక్కు ఉందన్నారు. తాను పదవుల కోసం యాచించేవాడిని కాదని, పార్టీలో చేసిన సేవలు చూస్తే సహజంగానే తనకు మంత్రి పదవి రావాలి అన్నారు. “అది అడుగుతో వచ్చినది కాదు, నా వంతు న్యాయంగా రావాల్సినది” అని స్పష్టం చేశారు. ఏవిధంగా కాంగ్రెస్ గెలిచిందో అందరికి తెలుసని, తాను చేస్తున్న పోరాటం వల్లే కాంగ్రెస్ తిరిగి బలపడిందని అభిప్రాయపడ్డారు. మంత్రివర్గ విస్తరణలో తనకు మంత్రి పదవి రావడాన్ని కొంతమంది కావాలనే అడ్డుకుంటున్నారని రాజగోపాల్ ఆరోపించారు. పార్టీకి వెన్ను పొడిచే విధంగా వ్యవహరించే వారిని అధిష్ఠానం పట్టించుకోవాలని సూచించారు. పార్టీకి సేవ చేసే వారికి పదవులు రావాలి, పదవుల కోసమే రాజకీయం చేసేవారికి కాదు అని ఘాటుగా వ్యాఖ్యానించారు. చౌటుప్పల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్న రాజగోపాల్ రెడ్డి, తనకున్న అభిప్రాయాలను బహిరంగంగా వెల్లడించారు. పార్టీ అంతర్గత వ్యవహారాలను పక్కనపెట్టి ప్రజాస్వామ్య వ్యవస్థలో తాను పోరాడతానన్నారు.