కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై నమోదైన పరువునష్టం కేసులో కాంగ్రెస్ సీనియర్ నేత, లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ (Rahul Gandhi) కి ఊరట లభించింది. బుధవారం (ఆగస్టు 6) ఆయన ఝార్ఖండ్‌లోని చాయ్‌బాసా ఎంపీ-ఎమ్మెల్యే కోర్టుకు హాజరై, అనంతరం న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది.

2018 సభలో చేసిన వ్యాఖ్యలపై కేసు
ఈ కేసు వెనుక కథనం 2018లో జరిగింది. అప్పట్లో బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ఉన్న అమిత్ షా (Amit Shah)పై చాయ్‌బాసాలో జరిగిన బహిరంగ సభలో రాహుల్ గాంధీ విమర్శలు చేశారని ఆరోపిస్తూ, ప్రతాప్ కుమార్ అనే వ్యక్తి కోర్టులో పరువునష్టం పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌ను పరిశీలించిన ప్రత్యేక న్యాయస్థానం, రాహుల్ వ్యక్తిగతంగా హాజరు కావాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది.
హాజరు తేదీ మార్పు.. హైకోర్టు ఆదేశాల మేరకు విచారణ
ముందుగా జూన్ 26న హాజరు కావాల్సి ఉన్నా, ఇతర రాజకీయ కార్యక్రమాల కారణంగా రాహుల్ తరఫు న్యాయవాది తేదీ మార్పు కోసం ఝార్ఖండ్ హైకోర్టు (Jharkhand High Court)లో పిటిషన్ వేశారు. హైకోర్టు ఆగస్టు 6న హాజరుకావాలని స్పష్టం చేసింది. ఈ మేరకు రాహుల్ గాంధీ ఈరోజు చాయ్‌బాసా కోర్టులో హాజరయ్యారు.
శిబు సోరెన్ అంత్యక్రియల సందర్బంగా రాష్ట్రంలో ఉన్న రాహుల్
ఝార్ఖండ్ మాజీ సీఎం శిబు సోరెన్ అంత్యక్రియలలో పాల్గొనడానికి ఇప్పటికే రాష్ట్రానికి వచ్చిన రాహుల్ (Rahul Gandhi), రాంచీ నుంచి హెలికాప్టర్ ద్వారా చాయ్‌బాసా చేరుకున్నారు. ఆయన రాకకు ముందు టాటా కాలేజ్ గ్రౌండ్‌లో హెలిప్యాడ్ ఏర్పాట్లు, కోర్టు పరిసరాల్లో భారీ భద్రత ఏర్పాటు చేశారు. బెయిల్ మంజూరయ్యాక, ఈ కేసులో తదుపరి విచారణ తేదీని కోర్టు నిర్ణయించనుంది.
Read hindi news: hindi.vaartha.com
Read also: