లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మోదీ తరహాలోనే కేజ్రీవాల్ కూడా అబద్ధాలు చెబుతూ ప్రజలను మోసం చేస్తున్నారని ఆయన విమర్శించారు. వారిద్దరి మధ్య ఎలాంటి తేడా లేదని, అసలు చెప్పాలంటే కేజ్రీవాల్ మోదీ కంటే ఎక్కువ కన్నింగ్ అని దుయ్యబట్టారు.
రాహుల్ గాంధీ ప్రత్యేకంగా ఢిల్లీ పరిపాలనపై దృష్టి పెట్టారు. ఎన్నికల సమయంలో కేజ్రీవాల్ యమునా నది నీటిని తాగడానికి అనువుగా మారుస్తానని హామీ ఇచ్చారని, కానీ ఇప్పటి వరకు ఆ హామీ కేవలం మాటలకే పరిమితమైందని ఎద్దేవా చేశారు. హామీలు నెరవేర్చే విషయంలో ఆప్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆయన ఆరోపించారు.

మోదీ, కేజ్రీవాల్ ఇద్దరూ ప్రజలను మభ్యపెడతారే కానీ, ఏ హామీని నిజంగా అమలు చేయడంలేదని రాహుల్ విమర్శించారు. ప్రజల సమస్యలను పరిష్కరించడానికి వీరు సీరియస్‌గా ఏ చర్యలు తీసుకోవడం లేదని, కేవలం ప్రచార రాజకీయాలకే పరిమితమయ్యారని ఆయన అన్నారు. ప్రజలు ఇకపై నిజమైన అభివృద్ధిని చూసి ఓటు వేయాలని సూచించారు.
తాము ఢిల్లీలో అధికారంలోకి వచ్చిన వెంటనే తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో కాంగ్రెస్ అమలు చేసిన విధానాలను ఇక్కడ కూడా తీసుకువస్తామని రాహుల్ ప్రకటించారు. ప్రజలకు నేరుగా ప్రయోజనం చేకూరే పథకాలను అమలు చేయడమే తమ లక్ష్యమని చెప్పారు. ప్రజా సంక్షేమాన్ని ప్రధాన లక్ష్యంగా చేసుకున్న పాలనను అందిస్తామని హామీ ఇచ్చారు.
ఇక ముందుగా ప్రజలు మోసపోవద్దని, రాజకీయ నాయకుల మాటలను విశ్లేషించి ఓటు హక్కును వినియోగించుకోవాలని రాహుల్ గాంధీ సూచించారు. కేజ్రీవాల్, మోదీ రాజకీయాల వల్ల దేశం మోసపోతుందని, ప్రజలకు నిజమైన సేవ చేయగల ప్రభుత్వం కాంగ్రెస్‌దేనని ఆయన తెలిపారు. ఢిల్లీలో కాంగ్రెస్ బలమైన ప్రత్యామ్నాయంగా మారుతుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.