తెలంగాణలో ఎస్‌ఎల్‌బీసీ సొరంగ మార్గంలో చిక్కుకున్న కార్మికులను కాపాడేందుకు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. ఈ ఘటనపై కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ విపక్ష నేత రాహుల్ గాంధీ సీఎం రేవంత్ రెడ్డికి ఫోన్ చేసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. బాధితులను రక్షించేందుకు ప్రభుత్వం చేపడుతున్న చర్యలపై సమగ్రంగా సమీక్షించారు. ఘటన జరిగిన వెంటనే మంత్రి ఉత్తమ్ ఘటనా స్థలానికి వెళ్లారని, అక్కడే ఉండి సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారని రేవంత్ గాంధీకి వివరించారు. ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్డీఆర్‌ఎఫ్ బృందాలు సహాయక చర్యల్లో పాల్గొంటున్నట్లు కూడా ఆయన తెలిపారు.

ఘటనా స్థలంలో భారీగా బురద
అయితే, ప్రమాదం జరిగిన 24 గంటలు గడుస్తున్నా, సహాయక చర్యలు ఆశించిన స్థాయిలో పురోగమించకపోవడంతో సొరంగంలో చిక్కుకున్నవారి పరిస్థితి ఏంటన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఘటనా స్థలంలో భారీగా బురద పేరుకుపోవడం, నీటి మట్టం పెరగడం, కరెంటు సరఫరా నిలిచిపోవడంతో పాటు ఆక్సిజన్ లభ్యత తగ్గడం సహాయక చర్యలకు ప్రధాన అవరోధంగా మారాయి. అయినప్పటికీ, బృందాలు నిరంతరం కృషి కొనసాగిస్తున్నాయని అధికార వర్గాలు తెలిపాయి.
సాధ్యమైనంత త్వరగా కార్మికులను రక్షించేందుకు ప్రభుత్వం చర్యలు
ఈ ఆపరేషన్‌లో 24 మంది ఆర్మీ సిబ్బంది, 130 మంది ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బంది, 24 మంది హైడ్రా బృందం, 24 మందితో కూడిన సింగరేణి కాలరీస్ రెస్క్యూ టీమ్, 120 మంది ఎస్డీఆర్‌ఎఫ్ సిబ్బంది భాగస్వామ్యమయ్యారు. సాధ్యమైనంత త్వరగా కార్మికులను రక్షించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని, రెస్క్యూ ప్రక్రియ మరింత వేగంగా సాగేందుకు అవసరమైన అన్ని సహాయ సహకారాలు అందిస్తున్నామని సీఎం రేవంత్ గాంధీకి వివరించారు.