హైదరాబాద్: ప్రధాని మోడీ కులంపై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మెదక్ ఎంపీ రఘునందన్ రావు స్పందించారు. మోడీ లీగల్లీ కన్వర్టెడ్ బీసీ అని సీఎం వ్యాఖ్యానించారు. ముందు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తన కులమేంటో చెప్పాలని రఘునందన్ డిమాండ్ చేశారు. ప్రధాని మోడీ మంత్రివర్గంలో 19 మంది బీసీలు ఉంటే.. రేవంత్ మంత్రివర్గంలో కేవలం ఇద్దరే ఉన్నారని గుర్తు చేశారు. ఇష్టానుసారం మాట్లాడిన వారంతా చరిత్రలో కలిసిపోయారని రఘునందన్ రావు అన్నారు. రేవంత్ రెడ్డి మాటల్లో చేతకానితనం కొట్టొచ్చినట్లు కనిపిస్తోందని విమర్శించారు.

కుల గణనలో పాల్గొనాలని చట్టంలో ఎక్కడైనా రాసి ఉందా అని రఘునందన్ రావు ప్రశ్నించారు. కుల గణనలో పాల్గొనని వారిని సామాజిక బహిష్కరణ చేయాలని కొందరు అంటున్నారని, అలా చెప్పడానికి రేవంత్ రెడ్డి ఎవరని నిలదీశారు. అసలు నరేంద్ర మోడీ గురించి మాట్లాడే నైతిక హక్కు రేవంత్ రెడ్డికి లేదని ఆయన స్పష్టం చేశారు. ఏదైనా మాట్లాడే ముందు ఆలోచించుకోవాలని హితవు పలికారు. మోడీ కులం ఓసీ నుండి బీసీకి మారిందని ఇప్పుడే కనిపెట్టినట్లు రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారని ఆయన ఎద్దేవా చేశారు.
కాగా, నరేంద్ర మోడీ పుట్టికతోనే బీసీ కాదు.. మోడీ సీఎం అయ్యాక ఆయన కులాన్ని బీసీలో కలిపారని సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. గాంధీ భవన్ లో కులగణన, ఎస్సీ వర్గీకరణ పై మాట్లాడారు. కేసీఆర్ లాంటి బలిసిన నేతలు సర్వేలో పాల్గొన్నారు. కేసీఆర్ ఒక్క రోజే సర్వే చేసి కాకి లెక్కలు చూపించారు. తెలంగాణ సమాజంలో జీవించే హక్కు కూడా కేసీఆర్ కు లేదన్నారు. మా లెక్కలు తప్పు పడితే బీసీలు శాస్వతంగా నష్టపోతారు. కులగణన పై ప్రణాలిక ప్రకారమే ముందుకు వెళ్తామని తెలిపారు. ఏ త్యాగానికైనా సిద్ధమయ్యే కులగణన చేశామని తెలిపారు.