Rabbit and Lion Story: అనగనగా ఒక అడవి. ఆ అడవిలో కొన్ని కుందేళ్లు నివసిస్తున్నాయి. అవి ఒకసారి తమ ఆహారం కోసం బయల్దేరాయి. వాటికి ఒక చోట పుష్కలంగా వాటి ఆహారం కనిపించింది.
అవి ఆనందంగా అక్కడికి వెళ్ళాయి. అంతలో అక్కడికి ఒక సింహం (Lion) వచ్చింది. సింహాన్ని చూసి కుందేళ్ళు హడలిపోయి, పరుగెత్తి పారిపోయి, గుబురు పొదల చాటున దాక్కున్నాయి. ఒక కుందేలు పారిపోయే లోపులోనే సింహం దాని దగ్గరకి సమీపించింది.

ఆ కుందేలుకి ఏం చేయాలో తోచలేదు. “పారిపోయినా వెంటబడి చంపుతుంది. అక్కడే వున్నా చంపుతుంది. ఎలాగూ చావు ఖాయం” అని మనస్సులో నిర్ణయించుకుంది. దానికి పక్కనే బాగా నీళ్లున్న ఒక బావి కనిపించింది. అది తెలివైన కుందేలు. దానికి వెంటనే ఒక తెలివైన ఆలోచన వచ్చింది. “ఏయ్ సింహం! అక్కడే ఆగు. నా పంజాతో కొట్టానంటే నా దెబ్బకి ఎగిరి అదిగో అక్కడున్న ఆ బావిలో పడ్తావు జాగ్రత్త” అంది.
సింహానికి ఒళ్లు మండిపోయింది. “నువ్వెంత? నీ బతుకెంత? నువ్వు కొడితే నేను ఆ బావిలో పడ్తానా? నీకు ఎంత పొగరు?” అని భయంకరంగా గర్జించింది.“నామాట నమ్మకపోతే ఇప్పుడే ఒక సింహాన్ని నా పంజాతో కొట్టాను. అది ఆ బావిలో పడింది. వెళ్లి చూసుకో, నేను ఎక్కడికీ పారిపోను. నేను చాలా బలశాలిని” అంది.

“సరే! చూస్తాను. అందులో సింహం లేకపోతే నిన్ను నమిలి మింగేస్తాను” అని ఆ సింహం బావి దగ్గరకు వెళ్ళి లోపలకి తొంగి చూసింది.
నిజంగానే కుందేలు పంజా దెబ్బ తిని, బావిలో పడిన సింహం కనిపించింది.
సింహం హడలిపోయింది. సింహం వణికిపోతూ, కుందేలు దగ్గరకు వచ్చి “నువ్వన్న మాట నిజమే. సింహం నిజంగానే బావిలో వుంది.
నేను నీ జోలికి రాను. నన్ను క్షమించు నేను వెళ్ళిపోతున్నాను” అని సింహం అక్కడ్నుంచి వెళ్ళిపోయింది.
పొదల చాటున దాక్కున్న కుందేళ్లన్నీ చాలా ఆశ్చర్యపోయాయి. అవన్నీ ఆ కుందేలు దగ్గరకు వచ్చాయి.
వాటిలో ఒకటి “నిజమేనా? నువ్వు చాలా బలశాలివా? నీ పంజా దెబ్బతిని, ఆ బావిలో సింహం నిజంగానే పడిందా?” అంది ఆశ్చర్యంతో. “దాని మొహం, ఆ బావిలో వేరే సింహం ఏం లేదు. దాని ప్రతిబింబం ఆ బావి నీళ్లలో దానికి కనిపించింది.
అది వేరే సింహం అనుకొని అది భయపడి, తోక ముడిచి పారిపోయింది” అంది తెలివైన కుందేలు. దాని తెలివికి కుందేళ్ళన్నీ దానికి జేజేలు పలికాయి.