సీనియర్ నటుడు, నిర్మాత ఆర్. నారాయణమూర్తి (Narayana Murthy) తాజాగా సినీ పరిశ్రమలో ఉన్న వివిధ సమస్యలపై పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేసిన “ప్రభుత్వాన్ని సినీ పెద్దలు కలవాలి” అన్న వ్యాఖ్యలకు ఆయన పూర్తి మద్దతు తెలిపారు. “ప్రభుత్వాన్ని సినీ పెద్దలు కలవాలి అని పవన్ కల్యాణ్ అనడంలో తప్పులేదు” అని నారాయణమూర్తి పేర్కొన్నారు. అయితే, పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) తన సినిమా ‘హరిహర వీరమల్లు’ గురించి ప్రస్తావన చేయకుండా కేవలం పరిశ్రమ సమస్యలపై చర్చించడానికి పిలిచినట్లైతే ఆయనపై మరింత గౌరవం పెరిగేదని, అది మరింత సమ్మానంగా ఉండేదని అభిప్రాయపడ్డారు.

హరిహర వీరమల్లు, థియేటర్లు మరియు బంద్ ప్రచారాలపై
నారాయణమూర్తి మాట్లాడుతూ, జూన్ 1 నుంచి ‘హరిహర వీరమల్లు’ సినిమాకోసం థియేటర్లు బంద్ చేస్తున్నారనే వార్తలను పూర్తిగా అబద్ధం అని ఖండించారు. ఇది సినిమా వ్యాపారానికి, ప్రేక్షకులకు పూర్తిగా నష్టం కలిగించే విషయం అన్నారు. సినిమా రంగంలో గద్దర్ అవార్డులను ప్రకటించడం గర్వకారణంగా ఉందని, అవార్డు గ్రహీతలను ఆయన అభినందించారు. అలాగే, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నంది అవార్డులను కూడా ప్రకటించాలని కోరారు.
పర్సంటేజీ వ్యవహారంపై తీవ్ర స్పందన
సినిమా రంగంలో పర్సంటేజీల వివాదంపై నారాయణమూర్తి తీవ్రంగా స్పందించారు. “పర్సంటేజీ విధానాన్ని కోరుకునే వ్యక్తుల్లో నేనూ ఒకడిని. ఈ విషయంలో ఛాంబర్ ముందు టెంటు వేసి ఆందోళనలు చేశాం. ఎంతోమంది ఛాంబర్ ప్రెసిడెంట్‌లకు విజ్ఞప్తి చేసినా సమస్య పరిష్కారం కాలేదు” అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పర్సంటేజీ ఖరారైతే తనలాంటి చిన్న నిర్మాతలకు ఎంతో మేలు జరుగుతుందని తెలిపారు. పర్సంటేజీ విషయం ఒక కొలిక్కి వచ్చే దశలో దానికి ‘హరిహర వీరమల్లు’ సినిమాకు లింకు పెట్టడం సరికాదని హితవు పలికారు. “బంద్ అనేది బ్రహ్మాస్త్రం.
సింగిల్ థియేటర్ల పరిరక్షణకు పిలుపు
నేటి రోజుల్లో సింగిల్ థియేటర్ల మనుగడ ప్రశ్నార్థకరమైంది. కార్పొరేట్ సిస్టమ్‌లకు వంత పాడుతున్నారు. మరి సింగిల్ స్క్రీన్ థియేటర్లు ఏమైపోవాలి? సింగిల్ థియేటర్లు దేవాలయాల్లాంటివి. అవి ఇప్పుడు కళ్యాణమండపాలుగా మారుతున్నాయి. పర్సంటేజీని బతికించి నిర్మాతలను కాపాడాలి” అని ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రేక్షకులు ఓటీటీలో సినిమాలు చూస్తే ఇండస్ట్రీ నాశనమవుతుందని కూడా ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
టికెట్ ధరల పెంపు పై విమర్శలు
సినిమా టికెట్ ధరలు పెరిగిపోవడం వల్ల ప్రేక్షకులు మరియు పరిశ్రమ రెండూ నష్టపోతున్నారని నారాయణమూర్తి అన్నారు. “వినోదం ఖరీదుగా మారింది. భారీ ఖర్చుతో సినిమాలు తీయడం సబబే, కానీ ఆ ఖర్చును ప్రజలపై రుద్ద వద్దు” అని ఆయన సూచించారు. హాలీవుడ్‌లో వందల కోట్లతో సినిమాలు తీస్తున్నారని, మన దగ్గర ‘షోలే’, ‘మొఘల్ ఏ ఆజాం’ లాంటి గొప్ప చిత్రాలు వచ్చాయని, వాటికోసం ధరలు పెంచలేదని గుర్తుచేశారు. “మన తెలుగులో ఐదేళ్లు ‘లవకుశ’ తీశారు. ఆ సినిమాకు టికెట్ ధరలు పెంచమని అడగలేదు. సినిమా బాగుంటే జనాలు వస్తారు. టికెట్ ధరలు పెంచడం వల్ల అభిమానులే వాళ్ల హీరోల సినిమాలు చూడటం లేదు” అని నారాయణమూర్తి తన అభిప్రాయాన్ని స్పష్టం చేశారు. ఈ సమస్యలను పక్కదారి పట్టించవద్దని, పరిశ్రమ పెద్దలు ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి పరిష్కరించుకోవాలని సూచించారు.
Read also: Nagarjuna: మా కుమారుడి పెళ్లికి రండి..సీఎం రేవంత్ ను ఆహ్వానించిన నాగార్జున