ప్రముఖ ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో తన 15 నిమిషాల ‘క్విక్’ డెలివరీ సేవను ప్రారంభించిన నాలుగు నెలలలోనే నిలిపివేసింది. వేగంగా ఆహారాన్ని వినియోగదారులకు చేరవేయాలనే లక్ష్యంతో ప్రారంభించిన ఈ సేవ, యాప్‌లోని ‘ఎక్స్‌ప్లోర్’ విభాగంలో ‘క్విక్’ ట్యాబ్ రూపంలో అందుబాటులో ఉండేది. హైదరాబాద్, ముంబై, బెంగళూరు, గురుగ్రామ్ వంటి నగరాల్లో ఈ సేవ తాత్కాలికంగా నిలిచినట్టు తెలుస్తోంది. అయితే దీనిపై సంస్థ నుంచి ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
2022లో ‘జొమాటో ఇన్‌స్టంట్’ పేరుతో 10 నిమిషాల డెలివరీ సర్వీస్ ప్రారంభం
ఇది జొమాటో అల్ట్రా-ఫాస్ట్ డెలివరీ రంగంలో చేసిన రెండో ప్రయత్నంగా చెప్పవచ్చు. 2022లో ‘జొమాటో ఇన్‌స్టంట్’ పేరుతో 10 నిమిషాల డెలివరీ సర్వీస్‌ను ప్రారంభించి, ఏడాదిలోనే నిలిపివేసింది. తాజాగా ‘క్విక్’ సేవను కూడా ఆపేయడం వెనుక నిర్వహణలో ఏర్పడిన సవాళ్లు, పోటీ సంస్థల ఒత్తిడి వంటి అంశాలే ప్రధాన కారణాలుగా పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. మార్చి నాటికి మొత్తం ఆర్డర్లలో క్విక్ సేవల వాటా 8 శాతంగా ఉన్నప్పటికీ, ఇది సంస్థ వ్యాపారంపై ప్రభావం చూపలేదని తెలుస్తోంది.
చిన్న మీల్స్, స్నాక్స్ డెలివరీ చేసే వ్యూహాన్ని అభివృద్ధి
ప్రస్తుతం జొమాటో తన దృష్టిని ‘బిస్ట్రో బై బ్లింకిట్’వైపు మళ్లిస్తోంది. బ్లింకిట్ అనే అనుబంధ సంస్థ డార్క్ స్టోర్ల ద్వారా వేగంగా చిన్న మీల్స్, స్నాక్స్ డెలివరీ చేసే వ్యూహాన్ని అభివృద్ధి చేస్తోంది. స్విగ్గీ స్నాక్, జెప్టో కేఫ్ వంటి ప్రత్యర్థులతో పోటీ పడేందుకు బ్లింకిట్‌ను బలోపేతం చేయడమే జొమాటో ప్రస్తుత లక్ష్యంగా కనిపిస్తోంది. దీని ద్వారా క్విక్ కామర్స్ విభాగంలో మరింత మెరుగైన స్థిరతను సాధించాలనే ఉద్దేశ్యంతో సంస్థ ముందుకు సాగుతోంది.
Read Also : Indian Cook : కువైట్‌లో భారతీయ వంటమనిషికి మరణశిక్ష అమలు