ఖతార్‌లో భారత సాంకేతిక రంగానికి చెందిన ఒక కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రముఖ ఐటీ కంపెనీ టెక్ మహీంద్రాలో సీనియర్ ఉద్యోగిగా పని చేస్తున్న అమిత్ గుప్తాను ఖతార్ పోలీసులు అరెస్టు చేశారు. గుజరాత్‌కు చెందిన ఆయనపై డేటా చౌర్యం ఆరోపణలు ఉన్నట్లు సమాచారం. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఈ ఘటనపై భారత ప్రభుత్వం, అమిత్ గుప్తా కుటుంబం, టెక్ మహీంద్రా గ్రూప్ స్పందిస్తూ వివిధ చర్యలు తీసుకుంటున్నాయి.

అమిత్ గుప్తా ఖతార్‌లో టెక్ మహీంద్రా సంస్థకు చెందిన ఖతార్-కువైట్ రీజియన్ హెడ్‌గా విధులు నిర్వహిస్తున్నారు. కంపెనీలో ఉన్న గోప్యమైన డేటాను దుర్వినియోగం చేశారనే ఆరోపణలపై స్థానిక పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. అయితే, ఈ కేసులో అసలు నిజానిజాలు ఇంకా బయటకు రాలేదు. కేసుకు సంబంధించి పూర్తి వివరాలు అందుబాటులోకి రావాల్సి ఉంది.
టెక్ మహీంద్రా స్పందన
ఈ అరెస్టు నేపథ్యంలో టెక్ మహీంద్రా గ్రూప్ స్పందిస్తూ, తమ ఉద్యోగికి పూర్తి మద్దతుగా నిలుస్తామని ప్రకటించింది. అమిత్ గుప్తా కుటుంబానికి అండగా ఉంటామని, వారికి అవసరమైన సహాయాన్ని అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని కంపెనీ స్పష్టం చేసింది. అంతేగాక, ఈ సమస్యను పరిష్కరించేందుకు రెండు దేశాల అధికారులతో చర్చలు జరుపుతున్నట్లు వెల్లడించింది. కంపెనీ పరంగా, తమ ఉద్యోగి నిర్దోషి అని, ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా ఉండేలా కుటుంబానికి సహాయం చేస్తామని తెలిపింది.
భారత రాయబార కార్యాలయం స్పందన
ఖతార్‌లో భారత రాయబార కార్యాలయం ఈ ఘటనపై స్పందించింది. అమిత్ గుప్తా విషయంలో ఖతార్ అధికారులతో చర్చలు జరుపుతున్నామని, అతన్ని విడిపించేందుకు ప్రయత్నిస్తున్నామని పేర్కొంది. భారత విదేశాంగ శాఖ ఈ కేసును దగ్గరగా గమనిస్తూ, అన్ని దిశలలోనూ కృషి చేస్తోందని పేర్కొంది. ఖతార్ ప్రభుత్వం, అక్కడి న్యాయ వ్యవస్థతో సంప్రదింపులు కొనసాగుతున్నాయని అధికారులు వెల్లడించారు. ఈ కేసు అమిత్ గుప్తా కుటుంబ సభ్యులను తీవ్ర ఆవేదనకు గురిచేసింది. ముఖ్యంగా అమిత్ గుప్తా తల్లి మాట్లాడుతూ, తన కుమారుడు పూర్తిగా నిర్దోషి అని పేర్కొన్నారు. సంస్థలో ఎవరైనా తప్పు చేసి ఉంటే, రీజియన్ హెడ్‌గా తన కుమారుడిని లక్ష్యంగా చేసుకుని అరెస్టు చేశారని ఆమె వాపోయారు. గత కొద్దీ రోజులుగా తమ కుమారుడు తమతో మాట్లాడకపోవడంతో అనుమానం వచ్చిందని, అతని స్నేహితులకు కాల్ చేయగా అరెస్టు విషయం బయటకు వచ్చిందని తెలిపారు. సమాచారం ప్రకారం, జనవరి 1న ఖతార్ పోలీసులు అమిత్ గుప్తాను అదుపులోకి తీసుకున్నారు. అప్పటి నుంచి మూడు నెలలుగా దోహాలో అతడిని నిర్బంధంలో ఉంచారు. కుటుంబ సభ్యులు ఈ విషయంపై తమ స్థానిక నాయకులను ఆశ్రయించారు. గుజరాత్‌లోని వడోదర ఎంపీ హేమాంగ్ జోషిని కలిసి, తమ కుమారుని విడుదలకు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ మేరకు ఎంపీ స్పందిస్తూ, దీనిని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లతానని హామీ ఇచ్చినట్లు సమాచారం. అమిత్ గుప్తాకు న్యాయ సహాయం అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు భారత అధికారులు తెలిపారు.