ఉక్రెయిన్‌పై యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో రష్యా అధ్యక్షుడు Vladimir Putin కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ యుద్ధానికి రష్యా ఎందుకు దిగిందో, దాని వెనుక ఉన్న ఉద్దేశ్యం ఏంటో ఆయన వెల్లడించారు. అదే సమయంలో, రష్యా తాజాగా ఉక్రెయిన్‌పై భారీ స్థాయిలో డ్రోన్ల దాడి జరపడం గమనార్హం.ఒక రష్యా ప్రభుత్వ టీవీ ఇంటర్వ్యూలో మాట్లాడిన పుతిన్, “ఈ యుద్ధం వెనుక ఉన్న అసలైన కారణాలు తొలగించాలన్నదే మా గోల్” అన్నారు. అలాగే, “రష్యా భద్రతకు గట్టి హామీ ఇవ్వడమే మా లక్ష్యం” అని స్పష్టం చేశారు. శాశ్వత శాంతికి అవసరమైన పరిస్థితులు నెలకొల్పాలన్నదే తమ అసలైన ఉద్దేశమని చెప్పారు.
భూభాగం మీద పట్టు – రష్యా ధీమా
ప్రస్తుతం ఉక్రెయిన్‌లో దాదాపు 20 శాతం భూభాగం రష్యా నియంత్రణలో ఉంది. ఆ భూభాగాన్ని నిలబెట్టుకోవడం కోసం అవసరమైన అన్ని వనరులు రష్యాకు ఉన్నాయని పుతిన్ ధీమా వ్యక్తం చేశారు. మాస్కో ఎప్పటికీ వెనక్కి తగ్గబోదని ఈ వ్యాఖ్యలతో స్పష్టమైంది.పుతిన్ ఈ మాటలు చెబుతుండగానే, రష్యా ఉక్రెయిన్‌పై అతిపెద్ద డ్రోన్ దాడికి దిగింది. శనివారం రాత్రి నుంచి ఆదివారం వరకు కొనసాగిన ఈ దాడిలో ఒక మహిళ మరణించారు. ఈ విషయాన్ని కీవ్ గవర్నర్ మైకోలా కలాష్నిక్ ధృవీకరించారు.
273 డ్రోన్లతో దాడి – ఉక్రెయిన్ ఆరోపణలు
ఉక్రెయిన్ వాయు దళాల ప్రకారం, రష్యా 273 షాహెద్ డ్రోన్లు మరియు పలు ఇమిటేటర్ డ్రోన్లను ఉపయోగించిందని వెల్లడించారు. వీటిలో 88 డ్రోన్లను అడ్డుకున్నట్లు చెప్పారు. మరో 128 డ్రోన్లు లక్ష్యాలకు చేరకుండా మధ్యలోనే నిలిపివేశామని పేర్కొన్నారు.ఈ దాడిపై ఉక్రెయిన్ ఉప ప్రధాని యులియా స్విరిడెంకో తీవ్రంగా స్పందించారు. “ఇది కావాలని చేసిన దాడి. పౌరులనే లక్ష్యంగా చేసుకుంది” అంటూ ఆమె తీవ్ర విమర్శలు చేశారు. ఇది ఇప్పటివరకు జరిగిన అతిపెద్ద డ్రోన్ దాడిగా చరిత్రలో నిలిచిపోయింది.
ఉక్రెయిన్ కూడా వెనుకడుగే వేయలేదు
ఇక రష్యా భద్రతా శాఖ ప్రకారం, ఆదివారం రాత్రి నుంచి సోమవారం ఉదయం వరకు ఉక్రెయిన్ ప్రయోగించిన 25 డ్రోన్లను వారు అడ్డుకున్నట్లు వెల్లడించారు. ఈ డ్రోన్లు రష్యా భూభాగంలోకి ప్రవేశించడానికి ప్రయత్నించాయని చెబుతున్నారు.
Read Also : Tornadoes : అమెరికాను కుదిపేసిన తుఫాను – 21 మందికి మృతి