గడచిన కొన్ని త్రైమాసికాలుగా దేశంలోని అగ్రవ్యాపారవేత్తల్లో ఒకడిగా ఉన్న గౌతమ్ అదానీ తన వ్యాపార సామ్రాజ్యాన్ని నిరంతరం విస్తరిస్తూనే ఉన్నారు. కీలక రంగాల్లో తన వ్యాపారాలను విస్తరించటానికి ఉన్న కొనుగోలు అవకాశాలను అన్వేషిస్తూ ముందుకు సాగుతున్న సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయన కన్ను మరో కంపెనీపై పడింది. వివరాల్లోకి వెళితే.. ఐటీడీ సిమెంటేషన్ ఇండియాలో మెజారిటీ వాటాల కొనుగోలు చేసేందుకు అదానీ గ్రూప్ కంపెనీ అయిన రెన్యూ ఎగ్జిమ్ డీఎంసీసీకి కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా తాజాగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. దీంతో అదానీ కంపెనీని దక్కించుకోవటానికి మార్గం సుగమం అయ్యింది. దీంతో ITD సిమెంటేషన్ ఇండియాలో 72.64% వాటాను కొనాలని అదానీ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఈ డీల్ కోసం అదానీ ఏకంగా రూ.5,757 కోట్లను ఆఫర్ చేస్తున్నారు. తాజాగా కాంపిటీటివ్ కమిషన్ దీనికి రూట్ క్లియర్ చేయటంతో అదానీ కిట్టీలోకి మరో కంపెనీ వచ్చి చేరనుంది.

కొనుగోలుదారు అయిన అదానీ సంస్థ రెన్యూ ఎగ్జిమ్ DMCC దుబాయ్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో రిజిస్టర్ చేయబడింది. ఐటీడీ సిమెంటేషన్ ఇండియా లిమిటెడ్ అనేది ఒక ఇంజనీరింగ్ అండ్ నిర్మాణ సంస్థ. ఇది భారీ సివిల్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇంజనీరింగ్‌తో పాటు ఇతర కార్యకలాపాలను నిర్వహిస్తుంది. ఈ సంస్థకు ఇండియాతో పాటు అనేక దేశాల్లో కార్యకలాపాలను కలిగి ఉంది. ఈ క్రమంలోనే అదానీ గ్రూప్ కంపెనీ అయిన రెన్యూ ఎగ్జిమ్ డీఎంసీసీ తాజాగా ఇంజనీరింగ్ అండ్ కన్‌స్ట్రక్షన్ సంస్థ ఐటీడీ సిమెంటేషన్ ఇండియాలో కీలక వాటాలను కొనుగోలు చేస్తున్నట్లు వెల్లడైంది. ఐటీడీ సిమెంటేషన్ ఇండియాలో 46.64 శాతం వాటాను దాని ప్రమోటర్ల నుంచి రూ.3,204 కోట్లకు ఒక్కో షేరుకు రూ.400 చొప్పున కొనుగోలు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు స్టాక్ ఎక్స్ఛేంజ్ నోటిఫికేషన్‌లో కంపెనీ ఇచ్చిన సమాచారం ప్రకారం వెల్లడైంది.