తెలంగాణ అసెంబ్లీ ప్రాంగణం నిరసనలతో హోరెత్తింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఫార్ములా ఈ-రేసు కేసులో మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావుపై (కేటీఆర్) ఏసీబీ కేసు నమోదు చేసినందుకు నిరసన వ్యక్తం చేశారు. “ప్రశ్నిస్తే కేసులా? కక్ష సాధింపు చర్యలేనా?” అంటూ నినాదాలు చేశారు. ఆందోళనలో భాగంగా తమ వెంట తెచ్చిన ప్లకార్డులను భద్రతా సిబ్బందికి అప్పగించి, సభలోకి వెళ్లిపోయారు.
బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీలో ఫార్ములా-ఈ రేసు అంశంపై చర్చ జరపాలంటూ వాయిదా తీర్మానం ప్రవేశపెట్టింది. ఈ రేసును హైదరాబాద్‌కు తీసుకురావడంలో కేటీఆర్ కీలక పాత్ర పోషించారని, కానీ ఇప్పుడు ఆయనపై అక్రమ కేసులు పెట్టడాన్ని ఖండిస్తున్నట్లు ఎమ్మెల్యేలు పేర్కొన్నారు. ఈ కేసులను రాజకీయ కక్ష సాధింపుగా పేర్కొంటూ అసెంబ్లీలో దీనిపై పూర్తి చర్చ జరగాలని డిమాండ్ చేశారు. ఫార్ములా-ఈ రేసు ద్వారా హైదరాబాద్ నగరానికి ప్రపంచస్థాయి గుర్తింపు వచ్చినట్లు బీఆర్ఎస్ నేతలు స్పష్టం చేశారు. రేసు నిర్వహణ ద్వారా నగరానికి మరింత అభివృద్ధి చోటు చేసుకుందని, ఇది తెలంగాణ ప్రతిష్టను పెంచిందని చెప్పారు. కానీ ఇప్పుడు ఇదే అంశంఫై కేటీఆర్‌ను లక్ష్యంగా చేసుకోవడాన్ని బీఆర్ఎస్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఫార్ములా-ఈ రేసును పరిగణలోకి తీసుకుని కేంద్రం కూడా ప్రశంసించిందని, కానీ ఇప్పుడు అక్రమ కేసులు పెట్టడం సరైన విధానం కాదని అభిప్రాయపడ్డారు. ఇది కేవలం రాజకీయ కక్ష సాధింపు చర్యలుగా అభివర్ణించారు. తాము దీనిపై పోరాటం ఆపబోమని స్పష్టం చేశారు.