కాలేజీ ప్రొఫెసర్ పలువురు మహిళా స్టూడెంట్స్‌ను లైంగికంగా వేధించాడు. వారి పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఒక బాధిత మహిళ పోలీసులకు లేఖ ద్వారా ఫిర్యాదు చేసింది. ఆ ప్రొఫెసర్ వికృత చేష్టలకు సంబంధించిన ఫొటోలు, వీడియో క్లిప్స్‌ను పంపింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆ కాలేజీ యాజమాన్యం కూడా ఆ ప్రొఫెసర్‌ను సస్పెండ్ చేసింది. ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. హత్రాస్‌లోని సేథ్ ఫూల్ చంద్ బాగ్లా పీజీ కాలేజీలోని భౌగోళిక విభాగం ప్రొఫెసర్ రజనీష్ కుమార్ పలువురు మహిళా విద్యార్థినుల పట్ల లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు.
ప్రొఫెసర్ రజనీష్‌పై పోలీసులకు ఫిర్యాదు
కాగా, మార్చి 13న ప్రొఫెసర్ రజనీష్‌పై పోలీసులకు ఒక అనామక ఫిర్యాదు అందింది. లేడీ స్టూడెంట్స్‌తో ఆ ప్రొఫెసర్ అసభ్యకరంగా ప్రవర్తించడంతోపాటు వీడియోలు రికార్డ్ చేశాడని బాధిత మహిళ ఆరోపించింది. ‘మోదీ ప్రభుత్వం ‘బేటీ బచావో బేటీ పఢావో’కు మద్దతు ఇస్తుంది. కానీ, ఆ తర్వాత కూడా ఇలాంటి వ్యక్తులు కుమార్తెలపై క్రూరత్వానికి పాల్పడుతున్నారు.
ఈ క్రూరమైన వ్యక్తి నన్ను చాలా బాధపెడుతున్నాడు. కొన్నిసార్లు నేను ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నా. దయచేసి విద్యార్థినులను రక్షించండి. అవమానం కారణంగా ఏ విద్యార్థిని బహిరంగంగా ఫిర్యాదు చేయలేదు. కాబట్టి, దయచేసి ఈ రాక్షసుడిపై కఠిన చర్యలు తీసుకోండి. నాలాంటి చాలా మంది అమ్మాయిలకు న్యాయం చేయండి’ అని ఆ లేఖలో వేడుకున్నది.
సోషల్ మీడియాలో వైరల్
మరోవైపు ఆ ప్రొఫెసర్ గత ఏడాదిన్నరగా విద్యార్థినులపై ఇలాంటి లైంగిక వేధింపులకు పాల్పడుతున్నట్లు బాధిత మహిళ ఆరోపించింది. మహిళా కమిషన్, ఇతర సీనియర్ అధికారులకు లేఖ ద్వారా ఫిర్యాదు చేసినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆమె విమర్శించింది. ప్రొఫెసర్ అసభ్యకరమైన చర్యలకు పాల్పడుతున్న ఫొటోలు, వీడియో క్లిప్స్‌ను పోలీసులకు పంపింది.