మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండేపై వివాదాస్పద వ్యాఖ్యల ఆరోపణలు ఎదుర్కొంటున్న స్టాండప్ కమెడియన్ కునాల్ కామ్రకు తాత్కాలిక ఊరట లభించింది. ఆయనకు ఇటీవల మంజూరు చేసిన తాత్కాలిక ముందస్తు బెయిలును మద్రాసు హైకోర్టు సోమవారంనాడు పొడిగించింది. ఏప్రిల్ 17వ తేదీ వరకూ ఈ గడువును పొడిగించింది.
మద్రాసు హైకోర్టును ఆశ్రయించిన కునాల్ కామ్ర
కునాల్ కామ్ర వివాదాస్పద వ్యాఖ్యలపై ముంబై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయడంతో ఆయన ఇటీవల మద్రాసు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో కోర్టు ఆయనకు తాత్కాలిక ముందస్తు బెయిలు మంజూరు చేసింది. ఆ గడువు సోమవారంతో ముగియనుండటంతో ఆయన తరఫు న్యాయవాది కోర్టుకు తన వాదన వినిపించారు. కునాల్‌పై మహారాష్ట్రలో మరో 3 కేసులు నమోదైనట్టు తెలియజేశారు. ముంబై పోలీసులు కునాల్ పట్ల శతృత్వంతో వ్యవహరిస్తున్నారని, ఆయన తల్లిదండ్రులను కూడా వేధిస్తున్నారని కోర్టుకు తెలిపారు. కాగా, మహారాష్ట్ర పోలీసులు తనకు వ్యతిరేకంగా నమోదు చేసిన ఎఫ్ఐఆర్‌లను కొట్టివేయాల్సిం దిగా ముంబై హైకోర్టును కూడా కునాల్ ఆశ్రయించారు. జస్టిస్ సారంగ్ కొత్వాల్ సారథ్యంలోని ధర్మాసనం ఏప్రిల్ 8న ఈ కేసు విచారణను చేపట్టనుంది.

అసలు ఇదీ వివాదం
ముంబైలో ఇటీవల జరిగిన కామెడీ షోలో ఏక్‌నాథ్ షిండేను ప్రస్తావిస్తూ కునాల్ ఒక పేరడీ సాంగ్ ప్రదర్శించారు. శివసేనను చీల్చడంలో షిండే పాత్రను ప్రస్తావిస్తూ ‘ద్రోహి’గా ఆయనను అభివర్ణించారు. యూట్యూబ్‌లో ఇందుకు సంబంధించిన వీడియో అప్‌లోడ్ కావడంతో శివసేన కార్యకర్తలు రెచ్చిపోయారు. ఆ పాటను రికార్డింగ్ చేసిన స్టూడియోను ధ్వంసం చేశారు. కునాల్‌పై శివసేన ఎమ్మెల్యే మురాజీ పటేల్ ఫిర్యాదు చేయడంతో మార్చి 24న ఎఫ్ఐఆర్ నమోదైంది. అ తర్వాత మరో మూడు ఎఫ్ఐఆర్‌లు కునాల్‌పై నమోదయ్యాయి. ఈ కేసులో విచారణాధికారి ముందు హాజరుకావాలంటూ కునాల్‌కు ముంబై పోలీసులు మూడుసార్లు సమన్లు జారీ చేశారు. అయితే కునాల్ విచారణకు గైర్హాజరయ్యారు. తనకు బెదిరింపులు వస్తున్నాయని పేర్కొంటూ మద్రాసు హైకోర్టును ఆశ్రయించారు.