లక్నో: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రయాగ్‌రాజ్ కుంభమేళాలో జరిగిన తొక్కిసలాటపై మీడియాతో మాట్లాడుతూ.. ప్రస్తుతం ప్రయాగ్‌రాజ్‌లో పరిస్థితి అదుపులో ఉన్నట్లు చెప్పారు. దాదాపు 8 నుంచి 8 కోట్ల మంది పుణ్య స్నానాలు ఆచరించేందుకు ప్రస్తుతం ప్రయాగ్‌రాజ్‌లో ఉన్నట్లు వెల్లడించారు. త్రివేణి సంగమ ముక్కు భాగానికి చేరుకోవాలన్న ఉద్దేశంతో జనం పోటెత్తుతున్నారని, దీంతో తీవ్ర వత్తిడి ఉంటోందన్నారు. మౌనా అమావాస్య సందర్భంగా జనం భారీగా వచ్చారని, అయితే అకాడాలు వెళ్లే మార్గం వద్ద ఉన్న బారికేడ్లను నెట్టివేశారని, దీంతో అక్కడ తొక్కిసలాట జరిగినట్లు చెప్పారు. గాయపడ్డ వారిని వైద్య చికిత్స కోసం ఆస్పత్రికి తరలించామన్నారు. మంగళవారం రాత్రే మౌనీ అమావాస్య ప్రారంభం కావడంతో.. లక్షల సంఖ్యలో జనం పుణ్య స్నానాలు ఆచరిస్తున్నారన్నారు.

త్రివేణి సంగమ ముక్కు భాగంతో పాటు నాగ వాసుకీ మార్గం, సంగం మార్గంలో రద్దీ ఎక్కువగా ఉన్నట్లు తెలిపారు. ఎటువంటి రూమర్‌ను భక్తులు నమ్మవద్దు అన్నారు. కుంభ్ జరిగే అన్ని ప్రదేశాల్లో ఘాట్లను ఏర్పాటు చేశామని, భక్తులు కేవలం సంగమ ప్రదేశానికే వెళ్లాలని చూడొద్దన్నారు. ఎక్కడ ఘాట దగ్గరగా ఉంటే, అక్కడ భక్తులు పవిత్ర స్నానాలు ఆచరించాలన్నారు. భక్తులు సురక్షితంగా ఇంటికి చేరేందుకు రైల్వే శాఖ ప్రత్యేక రైళ్లను ప్రయాగ్‌రాజ్ నుంచి నడుపుతున్నట్లు చెప్పారు.
ఇక, కుంభమేళా పరిస్థితిపై ప్రధాని మోడీ ఫోన్ చేశారని, ఆయన నాలుగు సార్లు మాట్లాడినట్లు తెలిపారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, గవర్నర్ ఆనందీబెన్ పటేల్.. పరిస్థితిన నిత్యం సమీక్షిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ప్రయాగ్‌రాజ్‌లో పరిస్థితి అదుపులో ఉన్నా.. జనం మాత్రం భారీగా ఉన్నట్లు ఆయన చెప్పారు. ముందుగా భక్తులు స్నానం చేసి వెళ్లి తర్వాత.. అకాడాలు రద్దీ తగ్గిన తర్వాత పుణ్య స్నానాలు ఆచరించనున్నట్లు తెలిపారు.