ప్రముఖ టాలీవుడ్ నిర్మాత ముళ్లపూడి బ్రహ్మానందం (68) మంగళవారం అనారోగ్యంతో కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో తుదిశ్వాస విడిచారు. ఆయన మృతితో సినీ పరిశ్రమలో విషాద ఛాయలు అలముకున్నాయి.
బుధవారం అంత్యక్రియలు
ముళ్లపూడి బ్రహ్మానందం కుమారుడు ప్రస్తుతం ఆస్ట్రేలియాలో ఉన్నాడు. ఆయన రాగానే బుధవారం కుటుంబ సభ్యులు అంత్యక్రియలను నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని కుటుంబసభ్యులు అధికారికంగా వెల్లడించారు. సినీ ప్రముఖులు, సన్నిహితులు ఆయన మరణానికి సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

ఈవీవీ కుటుంబానికి అత్యంత సన్నిహితుడు
ముళ్లపూడి బ్రహ్మానందం, దివంగత ఈవీవీ సత్యనారాయణ కు అత్యంత సన్నిహిత బంధువు. ఈవీవీ సినిమాలకు ఆయన ప్రత్యేకంగా మద్దతుగా నిలిచేవారు. తన కెరీర్‌లో పలు విజయవంతమైన చిత్రాలను నిర్మించి, ఇండస్ట్రీలో తనదైన గుర్తింపు తెచ్చుకున్నారు.
హిట్ సినిమాల నిర్మాత
నిర్మాతగా “నేను”, “అల్లుడుగారు వచ్చారు”, “మనోహరం”, “ఓ చిన్నదానా” వంటి విజయవంతమైన సినిమాలను అందించారు. ఆయన నిర్మించిన చిత్రాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ముళ్లపూడి బ్రహ్మానందం మృతితో టాలీవుడ్ మరో అనుభవజ్ఞుడైన నిర్మాతను కోల్పోయింది.