ప్రయివేట్ భూముల తొలగింపు నిర్ణయం
పేదలకు, నిజమైన భూ యజమానులకు న్యాయం చేయాలనే లక్ష్యంతో ప్రయివేట్ భూముల తొలగింపు నిర్ణయం తీసుకున్నట్లు రాష్ట్ర రెవెన్యూ, రిజిస్ట్రేషన్ & స్టాంప్స్ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. ఈ మేరకు గత నెల 17వ తేదీన మెమోను విడుదల చేశామని, నిషేధ ఆస్తుల జాబితా నుంచి ప్రయివేట్ భూములతొలగింపు గురించి స్పష్టమైన మార్గదర్శకాలు అందులో పేర్కొన్నామని తెలిపారు.
గ్రామ కంఠ భూములకు విముక్తి
శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, పంచాయతీల్లో గ్రామ కంఠాల్లో ఉన్న ప్రయివేట్ వ్యక్తుల ఆస్తులను కూడా నిషేధ జాబితా నుంచి తొలగించాలని అధికారులను ఆదేశించినట్లు వెల్లడించారు. 2015లోనే అప్పటి ప్రభుత్వం 187 జీవో ద్వారా సామాజిక ఆస్తులు మినహా మిగిలిన భూములను తొలగించేందుకు నిర్ణయం తీసుకున్నప్పటికీ, గత ప్రభుత్వం రీ సర్వే పేరుతో రాష్ట్రవ్యాప్తంగా 4,157 ఎకరాలను నిషేధ జాబితాలో చేర్చిందని చెప్పారు. దీని వల్ల సామాన్య ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని, ఇప్పుడు వాటిని పరిశీలించి తొలగించే విధంగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
అక్రమ భూముల క్రమబద్ధీకరణకు ఒక ఏడాది గడువు
ప్రభుత్వ భూములను ఆక్రమించి ఇళ్లను నిర్మించుకున్న వారికి క్రమబద్ధీకరణ సౌకర్యాన్ని కల్పిస్తున్నామని మంత్రి తెలిపారు. వీరు ఈ అవకాశాన్ని వినియోగించుకోవడానికి ఏడాది గడువును ఇచ్చినట్లు పేర్కొన్నారు. గత ప్రభుత్వం చేపట్టిన భూముల రీ సర్వే అనేక లోపాలతో నిండి ఉందని, అది భూ యజమానులకు న్యాయం చేసే విధంగా లేకుండా మార్చివేసిందని ఆరోపించారు. అయితే ప్రస్తుత ప్రభుత్వం సమగ్ర రీ సర్వే ద్వారా భూమి సమస్యలను పరిష్కరించేందుకు కట్టుబడి ఉందని మంత్రి అనగాని సత్యప్రసాద్ స్పష్టం చేశారు.