న్యూఢిల్లీ: రాజధాని అమరావతి పనుల పునఃప్రారంభం కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా జరగనుంది. రాజధాని పనుల్ని వచ్చే నెలలో అట్టహాసంగా ప్రారంభించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. దానికి ప్రధానిని ఆహ్వానించగా ఆయన అంగీకారం తెలిపినట్టు సమాచారం. తేదీ ఇంకా ఖరారు కాలేదు. తొమ్మిదేళ్ల క్రితం రాజధాని పనులకు ప్రధాని మోడీ చేతుల మీదుగానే ఘనంగా శంకుస్థాపన జరిగింది. రాజధాని నిర్మాణం వేగంగా జరుగుతున్న తరుణంలో అధికారంలోకి వచ్చిన జగన్ ప్రభుత్వం అమరావతిపై కక్షగట్టి, ఎక్కడి పనులు అక్కడే నిలిపేసింది. అమరావతి విధ్వంసానికి కంకణం కట్టుకుంది. మూడు రాజధానుల ప్రతిపాదనను తెరపైకి తెచ్చి, అమరావతి రైతుల ఉద్యమాన్ని ఉక్కుపాదంతో అణచివేయాలని చూసింది. అప్పుడు అమరావతి రైతుల ఉద్యమానికి టీడీపీ, జనసేన వంటి పార్టీలతో పాటు బీజేపీ కూడా అండగా నిలిచింది.

రాజధాని పనులకు రాష్ట్ర ప్రభుత్వం టెండర్లు ఖరారు
రాష్ట్రంలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే రాజధాని పనుల్ని పట్టాలెక్కించేందుకు నడుంకట్టింది. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం కూడా ఈసారి రాజధానికి పూర్తిస్థాయిలో అండగా నిలిచింది. కేంద్రం చొరవ వల్లే రాజధాని నిర్మాణానికి ప్రపంచబ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు (ఏడీబీ) రూ.15 వేల కోట్ల రుణాన్ని అత్యంత వేగంగా మంజూరు చేశాయి. హడ్కో కూడా రూ.11 వేల కోట్లు ఇచ్చేందుకు సూత్రప్రాయంగా ఆమోదం తెలిపింది. గత వైసీపీ ప్రభుత్వం సృష్టించిన అడ్డంకుల్ని ఈ తొమ్మిది నెలల్లో అధిగమించి… రాజధాని పనులకు రాష్ట్ర ప్రభుత్వం టెండర్లు ఖరారు చేసింది. రూ.37,702 కోట్ల పనులకు టెండర్లు ఖరారయ్యాయి. అన్ని పనుల్నీ దాదాపు ఒకేసారి ప్రారంభించబోతున్నారు. ఆ కార్యక్రమాన్ని ప్రధాని చేతుల మీదుగా ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.