మౌని అమావాస్య నాడు ఉదయం జరిగిన మహా కుంభంలో తొక్కిసలాట తలెత్తడంతో సుమారు 30 మంది మహిళలు గాయపడ్డారు. మహా కుంభమేళాలో తొక్కిసలాట జరిగిందని తెలుసుకున్న వెంటనే, పరిస్థితిని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమీక్షించారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌తో మాట్లాడి, తక్షణ సహాయక చర్యలు తీసుకోవాలని సూచించారు. మోదీ ఈ ఘటనపై నిరంతరం పర్యవేక్షణ కొనసాగిస్తున్నారని, ఇప్పటివరకు రెండుసార్లు సీఎం ఆదిత్యనాథ్‌తో మాట్లాడారని అధికార వర్గాలు వెల్లడించాయి. మౌని అమావాస్య సందర్భంగా లక్షలాది మంది భక్తులు పవిత్ర స్నానానికి తరలివచ్చారు. ఈ నేపథ్యంలో బుధవారం తెల్లవారుజామున తొక్కిసలాట ఏర్పడింది. భారీ జనసందోహం కారణంగా ప్రమాదం ఏర్పడే సూచనలు ఉండటంతో, అధికారులు వెంటనే చర్యలు చేపట్టారు.

ఈ ఘటన నేపథ్యంలో, అఖారాలు మౌని అమావాస్య కోసం తమ సాంప్రదాయ అమృత స్నానాన్ని తాత్కాలికంగా నిలిపివేశారు. అయితే, పెద్ద సంఖ్యలో భక్తులు మేళా ప్రాంతంలోని సంగం మరియు ఇతర ఘాట్‌ల వద్ద స్నానం కొనసాగించారు. ఈ ఘటనపై ప్రధాని మోదీ స్వయంగా పర్యవేక్షణ కొనసాగిస్తున్నారు, తక్షణ సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. భక్తుల భద్రత కోసం యూపీ ప్రభుత్వం అప్రమత్తమై ఉండగా, గాయపడిన వారి సంఖ్యపై మరింత స్పష్టత రావాల్సి ఉంది.