నిత్యావసర వస్తువులతో పాటు వివిధ సరుకుల ధరలు(Prices) సామాన్య, మధ్యతరగతి కుటుంబాలకు అందుబాటులో లేనంతగా పెరిగిపోతున్నాయి. కరోనా కష్టాల నుంచి గట్టెక్కే ప్రయత్నం చేస్తున్న ప్రజానీకానికి ఈ ధరల పెరుగుదల ఆందోళన కలిగిస్తోంది. ప్రధానంగా పెట్రోలు, డీజిల్ ధరలు పెరగడంతో ఆ ప్రభావం అన్ని వస్తువులు, సరుకులపై చూపిస్తోంది. చివరకు మార్కెట్లో కూరగాయలు కూడా కొనలేని పరిస్థితి ఉంది.

ఈనెలలో ఇప్పటి వరకు దాదాపుగా ప్రతిరోజూ పెట్రోలు,(petrol) డీజిల్ (diesel)ధరలు పెరుగుతున్నాయి, తెలంగాణ కంటే ఆంధ్రప్రదేశ్లో మరో రెండు రూపాయలు అధికంగా ఉంటోంది. ఆంధ్రలో రెండు రూపాయలు అదనంగా ప్రత్యేక పన్ను వేయడంతో మరింత భారంగా మారింది. కరోనా సమయంలో ఒక్కసారిగా పెట్రోలియం ఉత్పత్తుల వాడకం తగ్గింది. దీనితో చమురు నిల్వలు పెరిగిపోయాయి.
అప్పటి నుంచి చమురు సంస్థలు ఉత్పత్తిని గణనీయంగా తగ్గించి వేశాయి. కరోనా నుంచి ఉపశమనం పొందిన తరువాత దైనందిన జీవితం ప్రారంభమైంది. దీనితో పెట్రోలు, డీజిల్ వాడకం సాధారణ స్థితికి వచ్చింది. అయితే చమురు సంస్థలు వ్యూహాత్మకంగా ఉత్పత్తిని నిలిపివేశాయి.
భారతదేశం పెట్రోలు, డీజిల్ విషయంలో పూర్తిగా దిగుమతులపైనే ఆధారపడుతోంది. దీనితో ఇక్కడ చమురు ధరల(prices) పెరుగుదల గణనీయంగా ఉంది. డీజిల్ వాడకం రవాణా రంగంలో కీలకంగా ఉంటుంది. సరుకులను దూరప్రాంతాలకు తీసుకువెళ్లే లారీలు, భారీ వాహనాలు అన్నీ డీజిల్నే ఇంధనంగా వాడుతుంటాయి.

డీజిల్ ధరలు పెరిగితే లారీలు అద్దెలు కూడా పెంచుతారు. వాహనం ప్రయాణించే ప్రతి కిలోమీటర్పై ధరల పెరుగుదల ప్రభావం చూపుతుంది. ఇక పెట్రోలు వాహనాలపై ఆధారపడి చిన్నతరహా వ్యాపారులు లావాదేవీలు సాగిస్తారు. వీరు కూడా ఇంధనం ఖర్చును వినియోగదారుడిపైనే వేస్తాయి.
దీనితో ఇళ్లవద్దకు వచ్చి విక్రయించే అనేక వ్యాపారులు ధరలు పెంచేశారు. ఉల్లిపాయల ధర సాధారణంగా ఒకటి రెండు నెలలు మాత్రమే పెరుగుదల సూచిస్తుంది. అయితే ఈసారి ఇంధనం ధరలు పెరగడం వల్ల గత నాలుగు నెలలుగా ధరలు కిందకు దిగడం లేదు. నిత్యం వినియోగించే కిరాణా సామాగ్రి పై కూడా ఇంధనం ధరల పెరుగుదల ప్రభావం చూపిస్తోంది.
వాస్తవానికి పెట్రోలు అసలు ధర 33 రూపాయల 60 పైసలు మాత్రమే, అయితే దీనిపై అనేక పన్నులను ఇష్టారాజ్యంగా విధించడం వల్ల అసలు ధరతో సంబంధం లేకుండా మూడు వంతులు పెరిగి 90 రూపాయలను దాటేసింది. కేంద్రం 33 రూపాయలు, రాష్ట్ర ప్రభుత్వం మరో 25 రూపాయలు పన్నుల రూపంలో వసూలు చేస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్లో మరో అడుగు ముందుకు వేయడంతో 27 రూపాయలు వసూలు చేస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు పెరగడం వల్లనే ఈ పరిస్థితి వచ్చిందని కేంద్రప్రభుత్వం వివరణ ఇస్తున్నా ప్రజలు మాత్రం ధరల పెరుగుదల పట్ల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
కేంద్రం, రాష్ట్రం కొంత తమ పన్నులను తగ్గించుకోవడం ద్వారా పెట్రోలు, డీజిల్ ధర పెరుగుదలకు కట్టడి చేయాలని సూచిస్తున్నారు. అయితే చమురు అమ్మకాలపై వస్తున్న ఆదాయాన్ని కోల్పోవడానికి కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు సిద్ధంగా లేవు, దీనితో ప్రజల గోడు ఎవ్వరూ పట్టించుకోవడం లేదు.
దేశంలో వ్యాపార లావాదేవీలను అన్నింటినీ జిఎస్టిలోకి తీసుకువచ్చిన ప్రభుత్వం చమురు విక్రయాలను మాత్రం స్వేచ్ఛగా వదిలివేసింది. చమురు అమ్మకాలపై జిఎస్టి విధిస్తే పెట్రోలు, డిజిల్ ధరలు సగానికి తగ్గుతాయి, అయితే ప్రభుత్వాలకు వచ్చే ఆదాయం కూడా ఆమేరకు తగ్గిపోతుంది.
ప్రజాకర్షణ కలిగిన పథకాలు అమలుచేయడానికి నిధుల కొరత ఏర్పడుతుంది. ప్రస్తుతం ప్రజల ఖాతాల్లోకి నేరుగా డబ్బు చెల్లించే విధానం ఎక్కువగా అమలులో ఉంది. దీనివల్ల నష్టమే కాని ఎటువంటి ఉపయోగం ఉండదు, రైతు భరోసా, అమ్మఒడి, కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ తో పాటు రకరకాల పింఛన్లు అమలులో ఉన్నాయి.
ప్రజలకు నేరుగా వారి ఖాతాల్లోకి డబ్బు పంపించకపోతే ఆ ప్రభావం ఓట్లపై చూపిస్తుంది. దీనితో గతంలో అమలుచేసిన పథకాలను నిలిపివేసే స్థితిలో ఏ ప్రభుత్వాలు లేవు, పైగా గత ప్రభుత్వం కంటే తామే మేలని చెప్పించుకోవడానికి మరికొన్ని పథకాలు అమలుచేస్తున్నారు.
పాఠశాలల్లో చదివే విద్యార్థులకు నేరుగా డబ్బు ఇవ్వడం కంటే ప్రభుత్వ విద్యాసంస్థల్లో సమస్యలను పరిష్కరించేందుకు ఈ నిధులు వినియోగిస్తే ఎంతో ప్రయోజనం ఉంటుంది. ప్రజలు ప్రైవేట్ విద్యకు లక్షల రూపాయలు వ్యయం చేయడం వదిలిపెట్టి ప్రభుత్వ పాఠశాలలకు క్యూ కడతారు.


దీనిద్వారా ప్రభుత్వ పాఠశాలలకు పూర్వ వైభవం వస్తుంది. రైతులకు నేరుగా ఇచ్చే మొత్తాలతో వ్యవసాయ రంగానికి కావల్సిన మౌళిక వసతులు, నీటిపారుదల వ్యవస్థలపై ఖర్చు చేస్తే పంటల విస్తీర్ణం పెరిగి రైతులకు ఆదాయం వస్తుంది.
అప్పుడు ప్రభుత్వం ఇచ్చే ఈ సొమ్ములు అవసరం ఉండవు, మరో పక్క ఉత్పత్తి పెరగడం వల్ల ప్రజలకు సరసమైన ధరలకు నాణ్యత కలిగిన ఆహార పదార్థాలు అందుతాయి. వృధా పథకాలకు డబ్బు ఖర్చు చేయకపోతే ప్రభుత్వాలకు ఆర్థిక సమస్యలు తగ్గుతాయి.


అప్పు డు పెట్రోలు, డీజిల్పై పన్నుల భారం తగ్గిస్తే పెరిగిన ధరలు కూడా కిందకు దిగి సామాన్యులకు అందుబాటులోకి వస్తాయి, అయితే సమస్యలను ఓట్ల కోణంతో చూసే ప్రభుత్వాలు ఇలాంటి సాహ సాలు చేయడానికి ముందుకు రావడం లేదు.
దీనితో సామాన్యులు, మధ్యతరగతి కుటుంబాల బతుకుల్లో ఏమాత్రం మార్పులు రావడం లేదు. ప్రతి అవసరానికి ప్రభుత్వం సహాయం చేస్తే బాగుంటుందన్న అభిప్రాయం పెరిగిపోతోంది. జనాకర్షణ కలిగిన పథకాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండి వాటిని రద్దుచేయాలని ఉద్యమించే చైతన్యం వచ్చినప్పుడే ఆర్థిక సమతుల్యత ఏర్పడుతుంది.
ప్రభుత్వాల్లో కూడా మార్పు వస్తుంది. ప్రజల ఖాతాల్లోకి నేరుగా డబ్బు పంపించే విధానానికి స్వస్తి పలికి ఆయా రంగాలను అభివృద్ధి చేయడం ద్వారా స్వయంపోషణకు ఆస్కారం ఇవ్వడానికి వినూత్న పథకాలు అమలు చేయాల్సిన అవసరం ఉంది.
Read Also: Srisailam Project :పెనుప్రమాదంలో శ్రీశైలం ప్రాజెక్ట్