పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల తొలిరోజు ఉభయసభల సంయుక్త సమావేశంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము కీలక ప్రసంగం చేశారు. ఉభయసభలనుద్దేశించి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ విధానాలను ఆమె వివరించారు. ఇందులో అభివృద్ధితో పాటు సంస్కరణల వేగం పెంచాల్సిన అవసరాన్ని ఆమె గుర్తుచేశారు. అలాగే స్వదేశీ ప్రాధాన్యంతో కేంద్రం చేపడుతున్న పలు కార్యక్రమాలను, పథకాలను వివరించారు. అదే సమయంలో ఏపీలోని పోలవరం ప్రాజెక్టునూ ఆమె ప్రస్తావించారు. ఏపీ విభజన హామీల్లో భాగంగా పోలవరంలో జాతీయ ప్రాజెక్టు నిర్మించి ఇస్తామని కేంద్రం హామీ ఇచ్చింది. ఈ పదేళ్లలో రెండుసార్లు కేంద్రంలో మోడీ సర్కార్ పలు మార్లు నిధులు కూడా కేటాయించింది.

అయితే మధ్యలో జరిగిన తప్పిదాలతో ప్రాజెక్టు నిర్మాణం అంతకంతకూ ఆలస్యమవుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఇవాళ పార్లమెంట్ ఉభయసభల నుద్దేశించి చేసిన ప్రసంగంలో పోలవరం ప్రాజెక్టును ప్రస్తావించారు. అంతే కాదు ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ రేపు కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్న తరుణంలో రాష్ట్రపతి ప్రకటన ప్రాధాన్యం సంతరించుకుంది. పోలవరం జాతీయ ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్రం కట్టుబడి ఉన్నట్లు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము తన పార్లమెంట్ ప్రసంగంలో తెలిపారు.