గర్భిణులు బాలింతలు జాగ్రత్త.ఆంధ్రప్రదేశ్‌లో గర్భిణులు, బాలింతలను టార్గెట్ చేస్తూ సైబర్ నేరగాళ్లు ఫేక్ లింకులు, మెసేజెస్ ద్వారా మోసాలకు పాల్పడుతున్నారు. ‘జనని సురక్ష యోజన’ పథకం ద్వారా ఆర్థిక సాయం అందిస్తామంటూ మెసేజ్‌లు పంపించి, బ్యాంక్ వివరాలు తీసుకొని వారి ఖాతాల్లోని డబ్బును కాజేస్తున్నారు. ఈ మోసాల గురించి బాపట్ల ఎస్పీ తుషార్ డూడీ వైద్య ఆరోగ్య శాఖకు సమాచారం ఇచ్చారు.

వాట్సాప్ ద్వారా నకిలీ సందేశాలు
ఈ కేటుగాళ్లు మొదటగా అంగన్వాడీ కార్యకర్తలు, ఏఎన్‌ఎమ్‌ల (ఆక్సిలరీ నర్సింగ్ మిడ్‌వైవ్స్) వివరాలను సేకరిస్తున్నారు. అనంతరం బాలింతలు, గర్భిణుల ఫోన్ నంబర్లను తెలుసుకుని వాట్సాప్ ద్వారా నకిలీ సందేశాలను పంపుతున్నారు. ముఖ్యమంత్రి ఫొటోను ఉపయోగించి నమ్మబలికే ప్రయత్నం చేస్తున్నారు.
గర్భిణులు, బాలింతలు అప్రమత్తం
అధికారులు గర్భిణులు, బాలింతలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. అసలు ప్రభుత్వం ఎప్పుడూ వ్యక్తిగత బ్యాంక్ వివరాలు అడగదని స్పష్టం చేశారు. ఎలాంటి సందేహాలు ఉన్నా అధికారిక ప్రభుత్వ వెబ్‌సైట్ లేదా హెల్ప్‌లైన్ ద్వారా ధృవీకరించుకోవాలని సూచిస్తున్నారు. ఇటువంటి ఫేక్ మెసేజెస్ వచ్చిన వెంటనే సైబర్ క్రైమ్ విభాగానికి ఫిర్యాదు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.