మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ, ఛత్రపతి శంభాజీ పై అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న నాగ్‌పూర్‌కు చెందిన జర్నలిస్టు ప్రశాంత్ కోరట్కర్ ను తెలంగాణలో అరెస్ట్ చేసినట్టు మహారాష్ట్ర పోలీసులు బాంబే హైకోర్టుకు తెలియజేశారు.

ప్రశాంత్ కోరట్కర్ బెయిల్ పిటిషన్ పై విచారణ సందర్భంగా ప్రభుత్వం తరఫున న్యాయవాది ఎస్. పాటిల్ వాదనలు వినిపించారు. కోరట్కర్ తెలంగాణలో అరెస్టు చేయబడిన విషయాన్ని కోర్టుకు తెలియజేశారు. అయితే, ప్రశాంత్ కోరట్కర్ తరఫున వాదించిన న్యాయవాది సౌరభ్ ఘాగ్ మాత్రం, ఆయన అరెస్టుకు సంబంధించిన ఎలాంటి సమాచారం తమకు అందలేదని చెప్పారు. అనంతరం బాంబే హైకోర్టు కోరట్కర్ బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించింది.
మహారాష్ట్ర పోలీసుల ప్రకటన
మహారాష్ట్ర కొల్హాపూర్ ఎస్పీ మహేంద్ర పండిట్ మీడియాతో మాట్లాడుతూ, ప్రశాంత్ కోరట్కర్‌ను తెలంగాణలో అదుపులోకి తీసుకున్నామని, ప్రస్తుతం ఆయనను కొల్హాపూర్‌కు తరలిస్తున్నట్లు ప్రకటించారు. కొల్హాపూర్‌కు చెందిన చరిత్రకారుడు ఇంద్రజీత్ సావంత్ ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదైంది. ఆయన చెప్పిన ప్రకారం, జర్నలిస్టు ప్రశాంత్ కోరట్కర్ తనతో ఆడియో సంభాషణలో అనుచిత వ్యాఖ్యలు చేశారని, ఈ వ్యాఖ్యలు సమాజంలో శత్రుత్వాన్ని రెచ్చగొట్టేలా ఉన్నాయని పేర్కొన్నారు. జర్నలిస్టు ప్రశాంత్ కోరట్కర్ తనపై వచ్చిన ఆరోపణలను పూర్తిగా కొట్టిపారేశారు. నా ఫోన్ హ్యాక్ చేశారు అని పేర్కొన్నారు. వైరల్ అవుతున్న ఆడియో నకిలీది అని అన్నారు. ఇది నా పై కావాలనే పన్నిన కుట్ర అని అభిప్రాయపడ్డారు. కేసు వెనుక రాజకీయ కోణం ఉందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రశాంత్ కోరట్కర్ గతంలో కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఆయనపై నిరంతర పర్యవేక్షణ కొనసాగుతోందని సమాచారం. కొందరు జర్నలిస్టులు మాత్రం ఇది మీడియాపై దాడి అంటూ ప్రశాంత్ కోరట్కర్‌కు మద్దతు తెలుపుతున్నారు. మహారాష్ట్ర పోలీసులు కోరట్కర్‌ను విచారించనున్నారు. న్యాయపరమైన దర్యాప్తు తర్వాత తుది నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. ఈ కేసు మరింత రాజకీయ దుమారాన్ని రేపే అవకాశముంది.