Prashant Kishor : నితీశ్ కుమార్ ఆరోగ్యంపై ప్రశాంత్ కిశోర్ సంచలన వ్యాఖ్యలు! బీహార్ రాజకీయాల్లో మరో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఆరోగ్య పరిస్థితిపై ప్రశాంత్ కిశోర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జన్ సురాజ్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, ప్రముఖ రాజకీయ వ్యూహకర్త అయిన ఆయన, సీఎం నితీశ్ తన మంత్రివర్గ సహచరుల పేర్లు మరిచిపోతున్నారని పేర్కొన్నారు. అంతే కాకుండా ఎక్కడ పర్యటిస్తున్నారో కూడా గుర్తుంచుకోవడం లేదని విమర్శించారు. ప్రజల ముందుకు రావడాన్ని ఆయన సహచరులు అడ్డుకుంటున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. నితీశ్ కుమార్ బహిరంగ సభల్లో మాట్లాడుతున్న సమయంలో సన్నిహితులు తప్పుడు సూత్రాలతో ప్రజల దృష్టి మరలుస్తున్నారని ప్రశాంత్ కిశోర్ ఆరోపించారు. ముఖ్యమంత్రి మానసిక స్థితి బాగానే ఉందా? అనే సందేహాలు ప్రజల్లో పెరుగుతున్నాయని తెలిపారు.

సీఎం ఆరోగ్యంపై మెడికల్ బులెటిన్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
ముఖ్యమంత్రి పరిసరాల వ్యక్తులు ప్రజల నుంచి నిజాలను దాచిపెడుతున్నారని ఆరోపించారు.
ముఖ్యమంత్రి ప్రజాసమస్యలను అర్థం చేసుకునే స్థితిలో లేరని విమర్శించారు.
బీపీఎస్సీ ఆందోళనల సమయంలో నితీశ్ కుమార్ అసలు ఏం చేశారు
ఇటీవల బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (BPSC) పరీక్షలపై తీవ్ర ఆందోళనలు జరిగాయి. అయితే, రాష్ట్రంలో అసలు ఏం జరుగుతోందనేది నితీశ్ కుమార్‌కు తెలియదని ప్రశాంత్ కిశోర్ ఆరోపించారు. “ఆయన పూర్తి స్థాయిలో స్పందించలేకపోతున్నారు” అని వ్యాఖ్యానించారు. సీఎం ఆరోగ్యంపై ప్రజలు నిజాలు తెలుసుకోవాలంటే, అధికారిక వైద్య నివేదిక తప్పనిసరి అని స్పష్టం చేశారు. 2023లోనే నితీశ్ కుమార్ మానసిక ఆరోగ్యంపై బీజేపీ నేత, ఆయన సన్నిహితుడు సుశీల్ మోదీ మొదటిసారి వ్యాఖ్యలు చేసినట్లు ప్రశాంత్ కిశోర్ గుర్తుచేశారు. అప్పటి నుంచే ఈ అంశంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయని అన్నారు. ప్రశాంత్ కిశోర్ వ్యాఖ్యలు బీహార్ రాజకీయాల్లో పెనుచర్చకు దారితీసేలా కనిపిస్తున్నాయి. ప్రభుత్వం సీఎం ఆరోగ్యంపై స్పష్టతనిస్తుందా? లేక ప్రజల్లో మరింత అనుమానాలు పెరుగుతాయా? అన్నది వేచి చూడాలి.